ఎక్స్‌గ్రేషియూ పెంపునకు సర్కారు యోచన
పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ వెల్లడి
కరీంనగర్/సిరిసిల్ల: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే మెరుగైన పరిహారం అందించేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతూ పెంచిన ఎక్స్‌గ్రేషియాను వచ్చే ఏడాదిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నిషేదించిన మైక్రోఫైనాన్స్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వపరంగా రైతాంగానికి చేయూతనందించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రైవేట్ వ్యాపారుల అప్పుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్‌పర్సన్ ఉమ, ఎమ్మెల్యే కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్యలొద్దు: కరువు పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, నేత కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే రూ.8,500 కోట్లు రైతుల రుణమాఫీకి కేటాయించిందని, వడ్డీలు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించామన్నారు. రైతులకు సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800 4254731ను ఆశ్రయించాలని సూచించారు.
హరితహారం ఫెయిలైంది: ‘రాష్ట్రంలో పెద్దఎత్తున మొక్కలు పెట్టి హరితహారాన్ని సక్సెస్ చేయాలని ప్రయత్నించాం. కానీ, వర్షాల్లేక హరితహారం ఫెయిలైందని’ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో గ్రామజ్యోతి ప్రణాళికలు తయారయ్యాయని, క్షేత్రస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి చేసి సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.