
రుణమాఫీఫైల్ తొలి సంతకం చేసిన ఘనత వైఎస్‌దే
ఆత్మకూరు(ఎం)/భువనగిరి, న్యూస్‌లైన్ : రెండోసారి రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణస్వీకారం అనంతరం ఉచిత విద్యుత్, రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఆత్మకూర్(ఎం), భువనగిరిలలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ఇంతవరకు ఆ ఫైల్ సంతకం చేయలేదన్నారు.
రైతులు వ్యవసాయం కోసం బంగారం, ఆస్తులు తాకట్టుపెట్టుకుని అప్పులు చేశారన్నారు. ఇప్పుడు మాట మార్చి నిర్ణీత సమయంలో అప్పులు తీసుకున్న వారికే మాఫీ చేస్తాననడం రైతులను మోసం చేయడమేనన్నారు. సీనియర్ నేత కె.జానారెడ్డి సీఎల్‌పీ నాయకుడిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజాసమస్యలపై స్పందిస్తూ ప్రజల మధ్యనే ఉంటానన్నారు. కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన జనగామ జిల్లాలో ఆలేరు నియోజకవర్గాన్ని కలపవద్దని కోరారు. ఆయన వెంట మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, ఎంపీటీసీ దిగోజు నర్సింహచారి,సుగుణాకర్, శివలింగం ఉన్నారు.