జగిత్యాల అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితులతో దిక్కుతోచని రైతులు ఆరుతడి పంటలైనా వేసుకుందామంటే.. అదీ కొలిసొచ్చేలా కనిపించడం లేదు. ఎడాపెడా కరెంటు కోతలు అన్నదాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రం కావడంతో ఆ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వర్షాభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సరిపడా లేకపోవడం, ఇప్పటికిప్పుడు ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో వర్షాకాలంలోనూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. రానున్న రోజుల్లో కరెంటు సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలు వేసినా.. వాటిని కాపాడుకోవడం ఎలాగా అని రైతులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం వేసిన పంటలను రక్షించుకునేందుకే నానా ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా అవసరాలకు రోజుకు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో 3.27 లక్షల వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటికి త్రీఫేజ్ కరెంటుకు రోజుకు ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. భారీ పరిశ్రమలకు రెండు మిలియన్ యూనిట్లు, గృహావసరాలకు 2.5 మిలియన్ యూనిట్లు, చిన్నతరహా పరిశ్రమలు, ఇతర వాటికి 1.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది.
మొత్తం 12 మిలియన్ యూనిట్లు కాగా, జిల్లాకు రోజూ 8.5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. 3.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండటంతో తరచూ కోతలు తప్పడం లేదు. షెడ్యూల్ ప్రకారం విద్యుత్ సరఫరా చేస్తే డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువ అయి సరఫరా వ్యవస్థ(గ్రిడ్) మీద ప్రభావం పడి కుప్పకూలే ప్రమాదముంది. దీంతో తరచూ కరెంట్ ట్రిప్ చేస్తున్నారు. 132 కేవీ లాంటి భారీ సబ్‌స్టేషన్లలోనే ఇలా కరెంట్ ట్రిప్ చేస్తున్నారు. దీంతో కరెంటు ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటోంది. మార్చి, ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురుకాగా... ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో జూలైలోనూ ఇదే స్థితి కొనసాగుతోంది.
రైతులు సహకరించాలి
విద్యుత్ ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో, అవరసరమైనంత కరెంట్ ఇవ్వలేకపోతున్నామని... రైతులు సహకరించాలని విద్యుత్‌శాఖ అధికారులు కోరుతున్నారు. వ్యవసాయ బావుల్లో నీరున్నప్పటికీ కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికే భూమిలో వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు పంపుసెట్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని చెబుతున్నారు. మరోవైపు వరిపొలాలు సాగుచేసేందుకు సిద్ధమవుతున్న వారిని వారించలేక విద్యుత్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
దిక్కుతోచని స్థితిలో అన్నదాత
ఓవైపు వర్షాలు లేక, విద్యుత్ అందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది. బావుల్లో నీరున్నా వినియోగించుకోలేని దుస్థితి. జిల్లాలో ప్రధాన పంట అయిన వరి సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఇప్పటికి 20 శాతం కూడా నార్లు పోయకపోవడంతో సాగుపరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో ఎస్సారెస్పీ ద్వారా సాగునీరందగా... ఆయకట్టు రైతులు అప్పుడప్పుడు మాత్రమే విద్యుత్ మోటార్లపై ఆధారపడేవారు. ఇప్పుడు వర్షాలు లేక... కాలువ నీరు రాక పూర్తిస్థాయిలో విద్యుత్ మోటార్లపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే విద్యుత్ అందించే అవకాశాలు లేవని అధికారులు ముందుగానే రైతులను హెచ్చరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.
ఆరుతడికీ కరెంట్ షాక్
Published Sun, Jul 13 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement