దేబాశిష్ ముఖర్జీ, అనితా డే, ఫజుల్ హక్, సందీప్ మిత్రా, నీతా శంకర్
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ పేరిట మహిళా ఎస్కార్ట్ సేవలు అందిస్తామంటూ వేలాదిమందిని మోసగించిన కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కాల్ సెంటర్ల మేనేజర్లు సందీప్ మిత్రా, నీతా శంకర్‌లను సిలిగురిలో పట్టుకొని ట్రాన్సిట్ వారంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. అయితే, ప్రధాన నిందితులు దేబాశిష్ ముఖర్జీ, ఫజుల్‌హక్ పరారీలో ఉన్నారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాస్‌లతో కలసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు తెలిపారు.
పెస్టిసైడ్ దుకాణం ముసుగులో కాల్‌సెంటర్...
పశ్చిమ బెంగాల్ హౌరాకు చెందిన దేబాశిష్ ముఖర్జీ పెస్టిసైడ్ దుకాణాన్ని నిర్వహించగా ఆశించినస్థాయిలో లాభాలు రాలేదు. దీంతో కోల్‌కతాకు చెందిన ఫజుల్ హక్‌తో జతకట్టి తక్కువ కాలంలో డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. యువకులకు ‘ఎస్కార్ట్ సర్వీసుల’పై ఉన్న మోజును క్యాష్ చేసుకోవాలనుకుని రెండున్నరేళ్ల క్రితం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వరల్డ్‌డేటింగ్.కామ్‌ను ప్రారంభించారు. వీరికి దేబాశిష్ స్నేహితురాలు అనితా డే కూడా సహకరించడంతో సిలిగురి కేంద్రంగా పెస్టిసైడ్ దుకాణం ముసుగులో ఓ కాల్‌సెంటర్ ప్రారంభించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గెట్‌యువర్ లేడీ.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మైలవ్ 18.ఇన్ పేరుతో కొత్త వెబ్‌సైట్లను సృష్టించడమే కాకుండా సిలిగురిలో 12 బ్రాంచ్‌లు, కోల్‌కతాలో 8 బ్రాంచ్‌లు ప్రారంభించారు. 400 మంది ఉద్యోగులతో కాల్స్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఫిమేల్ ఎస్కార్ట్ పేరిట లోకంటో.కామ్‌లోనూ కాల్‌సెంటర్ ఫోన్ నంబర్లను పోస్ట్ చేశారు. ఈ నంబర్లలో సంప్రదించినవారితో దశలవారీగా డబ్బులు కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించేవారు. రోజుకు ఒక్కో సెంటర్ నుంచి 200 ఫోన్‌కాల్స్ చేస్తూ నెలకు ఆరు కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేవిధంగా వృద్ధి సాధించారు.
ఎనిమిది దశల్లో లక్షల వసూళ్లు...
ఆయా డేటింగ్ వెబ్‌సైట్లలో యువకులను ఆకర్షించే విధంగా గూగుల్‌లోనే డౌన్‌లోడ్ చేసిన అందమైన ఆకర్షించే అమ్మాయిల ఫొటోలను అప్‌లోడ్ చేశారు. తొలుత మెంబర్‌షిప్ కోసం 1,080 ఫీజు కట్టమంటారు. తర్వాత క్లబ్‌లైసెన్స్, రిజిస్ట్రేషన్, సర్వీస్, జీఎస్‌టీ, అకౌంట్ వెరిఫికేషన్, బ్యాంక్ గ్రౌండ్ వెరిఫికేషన్, ఫైనల్ పేమెంట్ ఫీజుల రూపంలో ఎనిమిది దశల్లో బాధితుల నుంచి డబ్బులు గుంజేవారు. అందమైన అమ్మాయిలను కేటగిరీగా విభజించి సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ ఫీజులను వసూలు చేశారు. ఈ విధంగానే సైబరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి వివిధ ఫీజుల రూపంలో రూ.15,19,614 చెల్లించారు. ఇందులో రూ.87,634ల జీఎస్‌టీ కూడా చెల్లించడం విశేషం.
చివరకు ఇతని ఫోన్ నంబర్ నుంచి ఫోన్‌కాల్స్ చేస్తే స్వీకరించడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్, ఎస్‌ఐ కె.విజయ్ వర్ధన్ నేతృత్వంలోని బృందం సిలిగురిలోని రెండు బ్రాంచ్‌లపై దాడి చేసి మేనేజర్లు సందీప్ మిత్రా, నీతా శంకర్‌లను పట్టుకుంది. అయితే, చాలామంది రూ.10 వేలు, రూ.20వేల వరకు కట్టినవారు తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో ముందుకు రాలేదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ డేటింగ్ మోసం అంశం కుటుంబాల్లో చిచ్చుపెట్టే అవకాశం ఉండటంతో ఎక్కువగా పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయితే, ఈ బ్రాంచ్‌ల్లో పనిచేస్తున్న 35 మందికి నోటీసులు జారీ చేశామని, వారందరూ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో త్వరలోనే విచారణకు హజరవుతారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment