
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌లోనూ సైబర్ నేరగాళ్లు తగ్గట్లేదు. ఒక్కో బాధితుడిని ఒక్కో రకంగా మోసం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మొత్తం రూ.6.64 లక్షలు కోల్పోయిన నలుగురు బాధితులు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎన్–95 మాస్కుల పేరుతో..
నగరంలోని మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి భారీస్థాయిలో మాస్కులు ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఇండియా మార్ట్ అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ చేశారు. దీనికి స్పందనగా ఆయనకు లోయిస్ రేస్ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి వాట్సాప్‌లో సందేశం వచ్చింది. తాము లండన్ కేంద్రంగా వ్యాపారం చేస్తుంటామని, ముంబైలోనూ ఓ కార్యాలయం ఉందంటూ నమ్మబలికాడు. కేవలం రూ.100కే నాణ్యమైన ఎన్–95 మాస్క్ అందిస్తానంటూ చెప్పాడు. అయితే డబ్బు మాత్రం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ ముంబైకి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చారు. ఇది నమ్మిన బాధితుడు ఆ బ్యాంకు ఖాతాల్లో రూ.3.67 లక్షలు జమ చేసి మోసపోయారు.
మీ సేవ వాలెట్ కమీషన్ పేరుతో..
లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం పేద ప్రజల జన్‌ధన్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసింది. దీన్ని వారు బ్యాంకులు లేదా మీ సేవ కేంద్రాల నుంచి డ్రా చేసుకుంటున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాలు జన్‌ధన్ ఖాతాల్లోని డబ్బును డ్రా చేసి ఇవ్వడానికి ఏఈఎస్(ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్) వినియోగిస్తారు. దీని ప్రకారం లబ్ధిదారుడు వచ్చి వీరి వద్ద ఉన్న పరికరంలో వేలిముద్ర వేస్తారు. ఆపై వారి ఖాతాలో ఉన్న డబ్బు మీ సేవ కేంద్ర నిర్వాహకుడు వినియోగించే వ్యాలెట్‌లోకి వెళ్తుంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారుడికి వెంటనే అందించే మీ సేవ నిర్వాహకుడు వాలెట్‌లోకి నిర్ణీత మొత్తం వచ్చిన తర్వాత తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకుంటాడు. దీనికి సంబంధించి ఆ వాలెట్స్ సైతం నిర్వాహకుడికి కమీషన్ ఇస్తుంది. గౌలిపురలో మీ సేవ నిర్వహించే ఓ వ్యక్తికి ఈ–కనెక్ట్‌సేవ.నెట్ వ్యాలెట్ నుంచి వారం క్రితం ఓ కాల్ వచ్చింది. తమ వాలెట్ వినియోగించాలని, అధికం మొత్తం కమీషన్ ఇస్తామంటూ ఎరవేశారు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చిన తర్వాత వాలట్‌లోకి రూ.50 వేలు వచ్చేవరకు వేచి చూశారు. ఆపై అందులో నుంచి ఆ మొత్తాన్ని వాలెట్ నిర్వాహకులు కాజేశారు.
గూగుల్ పే కాల్ సెంటర్ పేరుతో..
నగరానికి చెందిన ఓ మహిళకు ఇటీవల కీలక ఆపరేషన్ జరిగింది. దీనికి కొనసాగింపుగా ఆమె క్రమం తప్పకుండా నిర్ణీత కాలం ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి ఉంది. ఒక్కో దాని ధర రూ.30 వేలు కావడంతో తన బ్యాంకు ఖాతాలో అవసరమైనంత బ్యాలెన్స్ ఉంచుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె రెండు రోజుల క్రితం తన పరిచయస్తులకు గూగుల్ పే ద్వారా రూ.20 వేలు బదిలీ చేశారు. అయితే ఆ మొత్తం అవతలి వారికి చేరకపోవడంతో గూగుల్ పే సంస్థను సంప్రదించాలని భావించారు. దీనికోసం ఆమె గూగుల్‌లో సెర్చ్ చేసి గూగుల్ పే కాల్ సెంటర్ పేరుతో ఉన్న ఓ నెంబర్ గుర్తించారు. దానికి సంప్రదించగా.. అది నకిలీది కావడంతో సైబర్ నేరగాళ్లకు కాల్ వెళ్లింది. గూగుల్ పే సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన నేరగాళ్లు ఆ మొత్తం తిరిగి రావాలంటే బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలంటూ తెలుసుకున్నారు. వీటితో పాటు ఓటీపీలు కూడా సంగ్రహించి ఆ ఖాతాలో ఉన్న రూ.1.27 లక్షలు కాజేశారు.
సెకండ్ హ్యాండ్ కారు పేరుతో..
బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సెకండ్ హ్యాండ్ కారు ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఫేస్‌బుక్‌లో ఉండే మార్కెట్ ప్లేస్‌లో సెర్చ్ చేశారు. అందులో ఉన్న ఓ కారు నచ్చడంతో అక్కడి నెంబర్‌తో సంప్రదింపులు జరిపాడు. బేరసారాల తర్వాత రూ.1.5 లక్షలకు రేటు ఖరారైంది. అడ్వాన్స్ పేరుతో బాధితుడి నుంచి రూ.1.2 లక్షలు తమ ఖాతాల్లో జమ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు ఆపై ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి మోసం చేశారు.