సాక్షి, సిటీబ్యూరో : దిశ మిస్సింగ్, ఆపై హత్యచారంలో కేసు నమోదు నుంచి నిందితుల ఎన్‌కౌంటర్ వరకు అంతా చట్టపరిధిలోనే జరిగిందని చెబుతున్న సైబరాబాద్ పోలీసులు.. అందుకు తగిన ఆధారాలు సిద్ధం చేశారు. గత నెల 27న దిశా ఘటన జరిగినప్పటి నుంచి ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత కూడా వస్తున్న విమర్శలన్నింటికీ పక్కా సాక్ష్యాలతో రూపొందించిన నివేదికను ఇటు న్యాయస్థానాలకు, అటు హక్కుల కమిషన్‌కు పంపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్‌కౌంటర్‌పై కొందరు సానుకూలంగా, మరికొందరు వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ప్రతి అంశాన్ని పక్కాగా నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ఈ కేసు విచారణలో సీసీ కెమెరాల ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు, పరిస్థితులను బట్టి నిర్ధారించే సర్కమ్‌స్టాన్సియల్ ఎడివెన్స్‌లతో పాటు లారీలో సేకరించి ఫోరెన్సికల్ ల్యాబ్‌కు పంపిన రక్తపు మరకలు, వెంట్రుకలే కీలక ఆధారాలుగా ఉన్నాయి. కిడ్నాప్, అత్యాచారం, హత్య.. ఇవి జరుగుతున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, హతురాలి శరీరం కాలిపోవడంతో స్వాబ్స్ వంటివి సేకరించే పరిస్థితి లేదు.
కాగా, ఎన్‌కౌంటర్ మరణాలకు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాల ప్రకారం ఇప్పటికే షాద్‌నగర్ ఠాణాలో చటాన్‌పల్లి వద్ద జరిగిన నలుగురి ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌తోపాటు కేసు డైరీ, ఎంట్రీలు, పంచనామాల తదితర సమాచారాన్ని కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడా అతిక్రమించలేదని, నిందితులు ఎదురుతిరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని సైబరాబాద్ పోలీసులు స్పష్టంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment