కమిషనరేట్‌ను రెండుగా విభజించేందుకు కసరత్తు
* జూన్ 2 నాటికి విభజన పూర్తి
* ఈస్ట్ సైబరాబాద్ పరిధిలోకి యాదాద్రి
* నేడోరేపో సీఎం తుది నిర్ణయం
* నగరం చుట్టూ గ్రోత్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్‌కు దాదాపు పది రెట్లకు పైగా ఉన్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను విభజించే ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రావతరణ దినమైన జూన్ 2 నాటికి ఈ విభజనను పూర్తి చేయాలని సర్కారు యోచిస్తోంది. నగర శివార్లలో జనసాంద్రత, రానున్న రోజుల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైబరాబాద్ కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ విభాగాలుగా విభజించేందుకు కసరత్తు చేస్తోంది. సైబరాబాద్ ఈస్ట్ పరిధిలోకి యాదాద్రిని సైతం తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై రెండు మూడ్రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దీని విభజన, అధిపతుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడానికి పోలీసు, హోంశాఖ అధికారులు గురువారం సీఎంతో భేటీ కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో వాయిదా పడింది. సైబరాబాద్ పరిధిలో నేరాలు కూడా పెరిగిపోతుండడంతో కమిషనరేట్‌పై పని భారం అధికమైంది. దీంతో కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజించడంతో పాటు సిబ్బంది, మౌలిక వసతులను పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈస్ట్ రెవెన్యూ జిల్లా నేపథ్యంలో
ప్రభుత్వం కొత్తగా 15 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మలక్‌పేట, సైబరాబాద్‌లోని ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌లతోపాటు నల్లగొండ జిల్లాలో ఉన్న భువనగిరి నియోజకవర్గాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని హైదరాబాద్ ఈస్ట్ జిల్లాగా పరిగణిస్తారని తెలుస్తోంది. భువనగిరిని రెవెన్యూ పరంగా హైదరాబాద్ ఈస్ట్ జిల్లాలోకి తీసుకువస్తున్న నేపథ్యంలో యాదాద్రిని సైతం సైబరాబాద్ ఈస్ట్‌లో కలపాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈస్ట్, వెస్ట్‌లో ఏయే జోన్లు?
సైబరాబాద్ ఈస్ట్‌లోకి మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లు, వెస్ట్‌లో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉండేలా కమిషనరేట్ విభజన చేపట్టాలని యోచిస్తున్నారు. దీంతో యాదాద్రిని సైతం మల్కాజ్‌గిరి జోన్‌లోకి తీసుకురావడం లేదా సైబరాబాద్ ఈస్ట్‌లో ఉప్పల్ కేంద్రంగా మరో జోన్ ఏర్పాటు చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్ జోన్లలోనే 24 పోలీస్ స్టేషన్లు ఉండటంతో ఉప్పల్ జోన్ ఏర్పాటు అనివార్యంగా కనిపిస్తోంది.
నగరం చుట్టూ అభివృద్ధి ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం చేపడుతున్న బృహత్ ప్రణాళికలో భాగంగా రాబోయే రోజుల్లో అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్లు రాబోతున్నాయి. మేడ్చల్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్‌మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, పటాన్‌చెరులో ఆటో పార్క్‌లు, పౌల్ట్రీ, వెజిటేబుల్ మార్కెట్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్‌కేసర్‌లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, కోకాపేటలో ఐటీ, స్పోర్ట్స్, ప్రభుత్వ సంస్థల పరిశ్రమలు, బొంగుళూరులో ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, పెద్ద అంబర్‌పేటలో మీడియా, ఆటోమోబైల్ అండ్ హోల్‌సేల్ ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ రానున్నాయి. ఈ కొత్త అభివృద్ధితో భద్రతాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్న యోచనతో ప్రభుత్వం కమిషనరేట్ విభజన కసరత్తును ముమ్మరం చేసింది.
జంట కమిషనరేట్లలో ఇదీ పరిస్థితి...
విస్తీర్ణం జనాభా 2015లో నమోదైన కేసులు సొత్తు సంబంధ నేరాలు సిబ్బంది
హైదరాబాద్
కమిషనరేట్ 256 చ.కి.మీలు 60 లక్షలు 18.379 4,175 9,850
సైబరాబాద్
కమిషనరేట్ 3,700 చ.కి.మీలు 65–68 లక్షలు 30,747 5,041 5,289
'సైబరాబాద్'.. ఇక ఈస్ట్, వెస్ట్
Published Fri, May 13 2016 2:37 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement