రేపు కారెక్కనున్న డీఎస్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో బుధవారం తెలంగాణ భవన్‌లో డీఎస్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లు చేసినట్లు పార్టీ కార్యాలయ వర్గాలు చెప్పాయి. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు, ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి మరికొందరు నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు డీఎస్‌ను అనుసరిస్తారని అంటున్నారు. మరికొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. చేరిక కార్యక్రమాన్ని అట్టహాసంగా కాకుండా, సాదా సీదాగానే జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. డీఎస్‌కు కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిగానీ, రాజ్యసభ సభ్యునిగాగానీ అవకాశం ఇచ్చే వీలుందంటున్నారు. త్వరలో జరగనున్న శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి గెలిపించి ముఖ్యమైన శాఖతో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.