పాడి పశువుల బీమా.. రైతుకు ధీమా | Dairy farmer said insurance .. | Sakshi
Sakshi News home page

పాడి పశువుల బీమా.. రైతుకు ధీమా

Published Thu, Feb 5 2015 2:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

పాడి పశువుల బీమా.. రైతుకు ధీమా - Sakshi

పాడి పశువుల బీమా.. రైతుకు ధీమా

పాడిరైతుల ప్రయోజనాలతో పాటు పాల ఉత్పత్తి పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని పునరుద్ధరించి రైతన్నకు ధీమా కల్పించింది. ప్రీమియం చెల్లింపును బట్టి పాడి రైతులకు కూడా ప్రమాద బీమా రక్షణ కల్పించింది. ఈ ఏడాది మార్చి 31లోపు ప్రీమియం చెల్లించిన వారికి బీమా వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
 - కరీంనగర్‌అగ్రికల్చర్
 
 బీమా ఇలా : ఏడాది లేదా మూడు సంవత్సరాలకు బీమా చేసుకునే అవకాశముంది. పశువు విలువ రూ.10వేలు ఉంటే బీమా ప్రీమియం రూ.790 చెల్లించాలి. ప్రభుత్వ రాయితీ రూ.395, సర్వీస్ ట్యాక్స్ రూ.90, రైతు వాటా రూ.455 చెల్లిస్తే మూడేళ్ల పాటు పశువుకు బీమా వర్తిస్తుంది. దీనికి అదనంగా రూ.50 ప్రీమియం కడితే రైతుకు మూడేళ్ల పాటు రూ.లక్ష బీమా వర్తిస్తుంది.
 
 ఉమ్మడి ప్రభుత్వం పశుబీమా పథకానికి క్రమేణా మంగళం పాడింది. గతేడాది నుంచి పశువులకు బీమా సౌకర్యం లేకుండా పోయింది. వేలాది రూపాయల విలువ గల పశువులు చనిపోతే రైతుకు తీవ్ర నష్టం కలిగింది. ఆర్థిక స్థోమత లేని రైతులు పాడి పశువుల పెంపకంపై వెనుకడుగు వేస్తుండడంతో క్రమంగా పశు సంతతి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాడిరంగాన్ని అభివృద్ధి చేసే దిశలో పశువుల బీమాను పునరుద్దరించింది. జిల్లాలో పాడిపశువుల సంఖ్య 2.25 లక్షలు ఉండగా అందులో పాలిచ్చే పాడి పశువులు 1.50 లక్షల వరకు ఉన్నాయి. 2007-2009 వరకు అమల్లో ఉన్న పశువుల బీమాకు నిబంధనల ప్రకారం ఒక్క పాడిపశువుకు రూ.2100 ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. బీమా చేసిన పశువు ఆకస్మికంగా లేదా ప్రమాద ంతో మృతి చెందితే రూ.50వేలు పరిహారం అందించేవారు. ఒకసారి ప్రీమియం కడితే మూడేళ్ల పాటు బీమా వర్తించేది. 2011లో రైతు చెల్లించాల్సిన ప్రీమియం రూ.3 వేలకు పెంచి పరిహారాన్ని రూ.30 వేలకు కుదించడంతో రైతులు నిరాశ చెందారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పశుబీమా పథకం రైతులకు అనుకూలంగా ఉంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో పశుబీమా కల్పించడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో పశువు విలువ రూ.10-60వేల వరకు పేర్కొంటూ రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి వెసులుబాటు కల్పించారు.  
 
 నిబంధనలు అనుకూలం...
 తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశుబీమా పథకంలో నిబంధనలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పథకంలో ఒక సంవత్సరం లేదా మూడు సంవత్సరాలకు బీమా చేసుకునే అవకాశముంది. పశువు విలువ రూ.10 వేలు ఉంటే బీమా ప్రీమియం మొత్తం రూ.790 చెల్లించాలి. ప్రభుత్వ రాయితీ రూ.395 వర్తిస్తుంది. సర్వీస్ ట్యాక్స్ రూ.90 గా నిర్ణయించారు. ఇందులో రైతు వాటా రూ.455 చెల్లిస్తే మూడేళ్ల పాటు పశువుకు బీమా వర్తిస్తుంది. దీనికి అదనంగా రూ.50 ప్రీమియం కడితే సంబంధిత రైతుకు సైతం మూడేళ్ల పాటు రూ.లక్ష బీమా సౌకర్యం కల్పించారు. ఇదే నిష్పత్తిలో పశువు విలువ రూ.60 వే ల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. దీంతో పాటు ఈ పథకంలో రైతుకు మరికొన్ని సౌకర్యాలు ఉన్నాయి. పశువు మృతి చెందిన తర్వాత సంబంధిత పశువైద్యాధికారిని సమాచారమిస్తే ఆయన పోస్టుమార్టం నిర్వహించి మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
 
  గతంలో పోస్టుమార్టం అనంతరం బీమా కంపెనీ ప్రతినిధి వచ్చి ధ్రువీకరిస్తేనే బీమా పరిహారం అందేది. ఇప్పుడు దానిని తొలగించారు. పశువు చనిపోతే నెలరోజుల్లోపు రైతుకు పరిహారం అందుతుంది. బీమా ప్రీమియం చెల్లించిన 30 రోజుల తర్వాత నుంచి బీమా సౌకర్యం అమల్లోకి వస్తుంది. పశువుకు చెల్లించే ప్రీమియంతో పాటు రూ.20 అదనంగా చెల్లిస్తే సంబంధిత రైతుకు ఏడాదిపాటు రూ.లక్ష ప్రమాద బీమా వర్తిస్తుంది. రూ.50 అదనంగా చెల్లిస్తే రైతుకు మూడేళ్ల పాటు రూ.లక్ష వరకు ప్రమాదబీమా వర్తిస్తుంది. బీమా డబ్బులు నేరుగా సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
 
 
 నేరుగా పరిహారం
 ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పశుబీమా పథకంలో బీమా చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే పరిహారం చేరుతుంది. జిల్లాలో 2.25 లక్షల వరకు పాడి పశువులున్నాయి. పశుబీమా పథకంలో ప్రీమియం బట్టి పాడి రైతులకు ప్రమాదబీమా రక్షణ కల్పించారు. ఈ పథకాన్ని  రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
 - డాక్టర్ రాంచందర్, పశుసంవర్దక శాఖ జేడీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement