దళితకవి పైడి తెరేష్‌బాబు మృతి | Dalit poet killed Paidi tereshbabu | Sakshi
Sakshi News home page

దళితకవి పైడి తెరేష్‌బాబు మృతి

Published Tue, Sep 30 2014 12:36 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

దళితకవి పైడి తెరేష్‌బాబు మృతి - Sakshi

దళితకవి పైడి తెరేష్‌బాబు మృతి

ప్రముఖ దళితకవి, రచయిత పైడి తెరేష్‌బాబు (51) అనారోగ్యంతో కన్నుమూశారు.

హైదరాబాద్: ప్రముఖ దళితకవి, రచయిత పైడి తెరేష్‌బాబు (51) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నివాసముంటున్న ఆయన ఈ నెల 13న కాలేయ సంబంధ వ్యాధితో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందారు. మంగళవారం ఉదయం భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం ఒంగోలుకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. ప్రజా గాయకుడు గద్దర్, విప్లవ కవి వరవరరావు, సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య తదితర ప్రముఖులు ఆస్పత్రిలో తెరేష్‌బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మరణం  దళిత సాహిత్యోద్యమానికి తీరని లోటని గద్దర్ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్, దళిత స్త్రీ శక్తి నేత గడ్డం ఝాన్సీ సంతాపం తెలిపారు. కావడికుండలు కవితా సంపుటిలోని ఆయన కవితా పాదం.. ‘కావడిలా కలుసుందాం... కుండల్లా విడిపోదాం’ అన్న నినాదాన్ని టీఆర్‌ఎస్ అధినేత,  సీఎం కేసీఆర్ అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో విరివిగా వాడారని రమణాచారి తెలిపారు. తెరేష్‌బాబు ఆలిండియా రేడియోలో పనిచేస్తూ అనేక శక్తివంతమైన కవితలను రాశారు. ఆయన రాసిన కవితల్లో ‘నేను నా వింతలమారి  ప్రపంచమా’, ‘కావడి కుండలు’, అల్పపీడనం, హిందూ మహాసముద్రం.. విశేష ప్రాచుర్యం పొందాయి. ఆయన మంచి గాయకుడు కూడా. గజల్స్ బాగా పాడేవారు. ఉద్యోగరీత్యా రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. చలపతి, విజయవర్ధన్‌రావుల ఉరిశిక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తెరేష్‌బాబు కీలక భూమిక పోషించారు. ఆయనకు భార్య షాహెరాబేగం, కొడుకు, కూతురు ఉన్నారు. తెరేష్ బాబు మృతికి ఆచార్య జయధీర్ తిరుమల రావు, ప్రజాకవి, గాయకుడు గోరేటి వెంకన్న, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.

 సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా కవిత్వం రాసిన ప్రముఖ కవి పైడితేరేశ్‌బాబు మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తెలంగాణ ప్రజల గోస తెలిసిన మనిషని పేర్కొన్నారు. సీమాంధ్ర, తెలంగాణను కావడి కుండలుగా పోల్చి.. విడిపోయినా కలిసుందామనే ఉదాత్త సందేశాన్ని ఆయన తన కవితల ద్వారా వ్యక్తం చేశారని సీఎం కొనియాడారు. తేరేష్‌బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement