
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్ గాయత్రి నగర్‌లో సుభాష్ (32) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆయన యశోద ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. డాక్టర్ సుభాష్‌ది మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామంగా వెల్లడైంది. ఆయన 2017లో నేరేడ్‌మెట్ నివాసి డాక్టర్ లాస్యను ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేళ్లుగా స్థానికంగా ఉన్న గాయత్రి నగర్‌లోని పద్మావతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు తెలిసింది. ఈక్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సుభాష్ జ్వరంగా ఉందని నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు సమాచారం. కాగా, అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో సుభాష్ విగత జీవిగా పడున్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుభాష్ మృతికి సంబంధించిన వివరాల కోసం ప్రయత్నించగా అతని బంధువులు నిరాకరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment