సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా సి.దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి పొన్నం అశోక్‌గౌడ్‌పై 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దామోదర్‌రెడ్డికి 760 ఓట్లు రాగా, అశోక్ గౌడ్‌కు 747 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ న్యాయవాదుల మద్దతుతో బరిలో నిలిచిన ఆర్. వినోద్‌రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆయన 602 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఉపాధ్యక్షుడిగా సి.హరిప్రీత్ ఎన్నికయ్యారు. ఆయన 771 ఓట్లు సాధించారు. కార్యదర్శులుగా కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, సుంకరి జనార్దన్‌గౌడ్‌లు విజయం సాధించారు. కోమటిరెడ్డి 819 ఓట్లు సాధించగా, జనార్దన్‌గౌడ్‌కు 770 ఓట్లు వచ్చాయి. రెండు కార్యదర్శుల పోస్టులకు మొత్తం ఐదుగురు పోటీ పడ్డారు. సంయుక్త కార్యదర్శిగా ఉప్పాల శాంతి భూషణ్‌రావు విజయం సాధించారు. ఆయనకు 887 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగా గెలుపొందిన జూకంటి అమృతరావు 1,052 ఓట్లు సాధించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా ఆకుల జనార్దన్ గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ.అనందరావు, ఎస్.శ్రీనివాసాచారి, పి.సత్య మంజులకుమార్, జె.కె.అనిత, సంజీవ్ కాల్వల, పెండెం సతీశ్ కుమార్, బొడ్డుపల్లి యాదయ్య ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా గెలుపొందిన దామోదర్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఏజీ రాజీనామా ప్రభావం?
అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా ప్రభావం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. టీఆర్‌ఎస్ న్యాయవాదుల మద్దతుతో బరిలోకి దిగిన వినోద్‌రెడ్డి విజయం ఖాయమని భావించినా, అనూహ్యంగా ఆయన మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆయన 620 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌రెడ్డి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న న్యాయవాదులు దామోదర్‌రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఓ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు గంపగుత్తగా దామోదర్‌రెడ్డికి మద్దతు పలికారు.
ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యత
ప్రతిరౌండ్‌లోనూ దామోదర్‌రెడ్డి ఆధిక్యత కనబరిచారు. మొదటి రౌండ్ నుంచి వినోద్‌రెడ్డి మూడో స్థానానికే పరిమితమవుతూ వచ్చారు. వినోద్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి అన్న ప్రచారం బాగా జరగడం ఆయన విజయవకాశాలను దెబ్బతీసింది. కొందరు సీనియర్ న్యాయవాదులు గట్టిగా అంతర్గత ప్రచారం నిర్వహించడం, టీఆర్‌ఎస్ న్యాయవాదుల ఓట్లతో విజయం ఖాయమని భావించినా వినోద్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. మొదటి రౌండ్ నుంచీ దామోదర్‌రెడ్డి, పొన్నం అశోక్‌గౌడ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు 13 ఓట్ల తేడాతో దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది. ఎప్పుడూ ఓటింగ్ యంత్రాల ద్వారా జరిగే పోలింగ్ ఈసారి ఈవీఎంలు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు నిరాకరించడంతో బ్యాలెట్ విధానంలో జరిగింది. దీంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఎప్పుడూ రాత్రి 8 లేదా 8.30 గంటలకల్లా పూర్తయ్యే ఓట్ల లెక్కింపు ఈసారి రాత్రి 2 గంటల వరకు సాగింది.
Comments
Please login to add a commentAdd a comment