నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బోర్డు సమావేశం ఈ నెల 22న శుక్రవారం జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. అనివార్యకారణాల కారణంగా బోర్డు సమావేశం వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ దానికి కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తుంది. వాయిదా తేదీని తరువాత ప్రకటించనున్నట్లు బ్యాంకు అధికారులు చెపుతున్నా ఇప్పట్లో సమావేశం జరిగే అవకాశాలు లేవని కొందరు బోర్డు డెరైక్టర్లు చెపుతున్నారు. వారం రోజుల క్రితం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆడిట్ నివేదికను ఆడిట్ అధికారులు ఆడిట్ కమిటీకి నివేదించారు.
దానిని వారం రోజుల ముందు ఇస్తే క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించేవారమని చెబుతూ వారం తరువాత కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదిస్తామన్న కమిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారు. తిరిగి ఆడిట్ కమిటీ సమావేశాన్ని బుధవారం ఏర్పాటుచేసినప్పటికీ ఖర్చుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికను తిరస్కరించినట్లు సమాచారం. అసలు ఆడిట్ కమిటీ నివేదికను బుధవారం ఆమోదిస్తే వెంటనే శుక్రవారం జరగాల్సిన పాలకమండలి సమావేశంలో దానిని ప్రవేపెట్టి నివేదికకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాని నివేదికను కమిటీ ఆమోదించని కారణంగా బోర్డు సమావేశం నిర్వహించని పరిస్థితి ఏర్పడడంతో దానిని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అయితే బోర్డు డెరైక్టర్‌ల సమాచారం మేరకు వాయిదాకు మరో కారణం కూడా తోడైనట్లు సమాచారం.
అక్రమాల చిట్టా పెరుగుతుండడంతో..
ఇటీవల దేవరకొండ అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుండడంతో అక్రమాల చిట్టా పెరుగుతుండడం వలన బోర్డు సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహరించిన జిల్లాస్థాయి అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సమావేశంలో బోర్డు సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమావేశం వాయిదా వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా చైర్మన్ పదవి విషయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డిని రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేసే అవకాశం కూడా ఉండడంతో సమావేశం వాయిదా వేసినట్లు వినికిడి. ఏదిఏమైనా డీసీసీబీలో నెలకొన్న పరిస్థితులు రైతులకు ఖరీఫ్ పంటరుణాలు అందక వారి పాలిటశాపంగా మారాయని చెప్పవచ్చు.
డీసీసీబీ బోర్డు సమావేశం వాయిదా
Published Fri, Aug 22 2014 3:12 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement