వెలుగు చూస్తున్న వ్యవహారాలు
- సీడీపీ నిధుల వినియోగంపై అభ్యంతరాలు
- ‘అవిశ్వాసం’ అనంతరం వాడీవేడీగా డీసీసీబీ సమావేశం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో నెలకొన్న విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన డీసీసీబీ వ్యవహారాలు ఈ విభేదాల పుణ్యమా అని ఇప్పుడు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. ఇటీవల డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం అనంతరం తొలిసారిగా బుధవారం బ్యాంకు మేనేజింగ్ కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ , 2013-14 ఆర్థిక సంవత్సర అడిట్ నివేదికల ఆమోదం వంటి అంశాలపై సభ్యులు వాడీవేడీగా చర్చించారు.
ఈ సమావేశానికి ఒకవర్గం డెరైక్టర్లు ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించాలని పట్టుబట్టగా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి మాత్రం ఇందుకు అనుమతించలేదు. ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా డీసీసీబీలో కొనసాగుతున్న వ్యవహారాలు బయటకు పొక్కాయి. ఒకవర్గం డెరైక్టర్లు పలు అంశాలపై డీసీసీబీ ఉన్నతాధికారులను నిలదీశారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు, బ్యాంకు లావాదేవీలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సీడీపీ నిధుల వినియోగం అంశంపై కూడా వాడీవేడీగా చర్చ జరిగింది.
ఈ నిధులను బ్యాంకు అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారని కొంద రు డెరైక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేసినట్లు ఆరోపించారు. అలాగే మార్చి 31లోపు పంట రుణం బకాయిలను మొత్తం చెల్లించిన సుమారు 400 మంది రైతులకు ఈ సారి రుణాలు మంజూరు చేయకపోవడం పట్ల మరికొందరు డెరైక్టర్లు అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, డెరైక్టర్లు దుర్గం రాజేశ్వర్, జోగిందర్‌సింగ్, సీఈవో అనంత్‌రావు పాల్గొన్నారు.