ప్రమాదానికి కారణమైన కారు, సయ్యద్ రియాజ్, బద్రుద్దీన్
నిజామాబాద్ అర్బన్: కారులో కూర్చుని సరదాగా ఆడుకుందామని అనుకున్నారు ఆ చిన్నారులు., కానీ ఆ కారే తమ పాలిట మృత్యుపాశం అవుతుందని గ్రహించుకోలేకపోయారు. ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులో ఎక్కిన ఇద్దరు చిన్నారులు కార్ డోర్ లాక్ అయి.. ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ముజాహిద్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సయ్యద్ రియాజ్ (10) మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇతనికి మహమ్మద్ బద్రుద్దీన్ (5) జత కలిశాడు. ఇద్దరు సమీపంలో ఉన్న పార్కులో కలసి కాసేపు ఆడుకున్నారు.
ఈ క్రమంలో అక్కడే పార్క్ చేసి ఉన్న ఓ కారులోకి సరదా కోసం ఎక్కారు. అయితే వెంటనే కారు డోర్‌లాక్ కావడంతో ఇద్దరు అందులోనే ఉండిపోయారు. కాసేపటికి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు కారులోనే మృత్యువాత పడ్డారు. సాయంత్రం 6 గంటలు అవుతున్నా చిన్నారులు ఇద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలోని అన్ని చోట్లా వారికోసం వెతికారు. అయినా వారి జాడ దొరకలేదు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కారు యజమాని అబ్దుల్ రహమాన్, తన కారును తెరిచి చూడగా వెనుక సీట్లో ఇద్దరు బాలుర మృతదేహాలు కనిపించాయి. వెంటనే రియాజ్ తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆడుకునేందుకు వెళ్లిన తమ పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
సీసీ కెమెరాలు పరిశీలించగా..
ఘటనాస్థలానికి చేరుకున్న ఒకటో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించగా బాలురు ఆడుకుంటూ కారులోకి వెళ్లినట్లు తేలింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చనిపోయిన ఇద్దరు పిల్లలు అక్కా చెల్లెళ్ల కొడుకులు. తన కలల రూపం కళ్ల ముందే మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment