రుణ మాఫీని అమలు చేస్తాం
బాల్కొండ : రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో ‘మన ఊరు- మన ప్రణాళిక’పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు.
ప్రజల ఆలోచనలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం మన ఊరు- మన ప్రణాళిక, మన మండలం- మన ప్రణాళిక, మన జిల్లా - మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని అందరూ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అధికారులు తూతూమంత్రంగా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమ విధి విధానాలను గురించి సుదీర్ఘంగా ప్రజాప్రతినిధులతో చర్చించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపభూయిష్టంగా ఉందని, సరిదిద్దాలన్నారు.
గ్రామ పంచాయతీలు చేపట్టాల్సిన పనులను ఎమ్మెల్యే, మంత్రి, ప్రభుత్వం చేపట్టదన్నారు. గ్రామాల్లో చెత్తను వేయడానికి ప్రతి గ్రామంలో అర ఎక రా భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమి లేకుంటే కొనుగోలు చేసి యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో అధికారులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ముందుగా ప్రభుత్వ బడులను ప్రక్షాలన చేయాలన్నారు. ప్రధానంగా నీళ్లు,నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, సీమాంధ్ర పాలకులు తెలంగాణ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. బోగస్ రేషన్‌కార్డుల ఏరివే తకు అందరూ సహకరించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో అక్రమంగా బిల్లులు తీసుకున్న వారి నుంచి డబ్బులు రికవరీ చేపట్టే చర్యలు కూడా చేపడతామన్నారు. బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతలో అధికారులు పక్షపాతం వహిస్తే దానికి వారే బాధ్యులవుతారన్నారు. ఉద్యోగుల కొరత వలన కొన్ని పనులు వేగంగా సాగడం లేదన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల్లో అక్షరాస్యత పెరిగితేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ సాధనే కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ యాదిరెడ్డి, డీఎల్‌సీఓ మనోజ్‌కుమార్, ఎంపీపీ రాధ, ఎంపీడీఓ కిషన్, తహశీల్దార్ పండరీనాథ్, మండల స్థాయి అధికారులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.