సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా జూలై 5 నుంచి 7 వరకు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. మూడో దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి శనివారం సీట్లను కేటాయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈసారి ప్రత్యేకంగా స్లైడింగ్ ఉండదని, స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఇదివరకు తక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడం వల్ల సీట్లు రాని వారు, సీట్లు వచ్చినా కాలేజీల్లో రిపోర్టు చేయని వారు కూడా ఈ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు.
ఇదివరకే సీటు వచ్చి, మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే ముందుగా వారికే సీట్లు కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి, కాలేజీల్లో సీట్లు వచ్చినా చేరని వారికి, గతంలో సీట్లు రాని వారికి సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ సీట్ల కేటాయింపును వచ్చేనెల 10న ప్రకటిస్తామని, విద్యార్థులు జూలై 11 నుంచి 13లోగా సంబంధిత కాలేజీల్లో చేరాలని సూచించారు. మరోవైపు మూడో దశలో 59,234 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా 57,294 మందికి సీట్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మరో 2 వేల మంది తక్కువ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చినందునా వారికి సీట్లు లభించలేదన్నారు. సీట్లు లభించిన విద్యార్థులంతా జూలై 4లోగా కాలేజీల్లో ఓటీపీ అందజేసి, సీట్ కన్‌ఫర్మ్ చేసుకోవాలన్నారు. జూలై 2న తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. మొబైల్ నంబర్ మార్పు చేసుకోవాలనుకునే వారు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో మార్పు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ, సీజీజీ అధికారులు పాల్గొన్నారు.
మొత్తంగా 1.84 లక్షల మందికి సీట్లు..
మూడు దశల కౌన్సెలింగ్‌లలో మొత్తంగా 1,84,157 మందికి సీట్లను కేటాయించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. అందులో బాలురు 1,00,743 మంది ఉండగా, బాలికలు 83,414 మంది ఉన్నట్లు తెలిపారు. దోస్త్ పరిధిలోని 1,045 కాలేజీల్లో 4,03,069 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 21 మైనారిటీ కాలేజీలు, 29 కాలేజీలు కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. మొదటి రెండు దశల్లో 1.51 లక్షల మందికి సీట్లను కేటాయిస్తే 1,26,863 మంది కాలేజీల్లో చేరారన్నారు.
ఒక్క విద్యార్థి చేరని కాలేజీలు 43..
డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా 43 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇక 25 మందిలోపు చేరినవి 88, 50 మందిలోపు చేరినవి 101, వందలోపు విద్యార్థులు చేరినవి 234 కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 54,375 సీట్లు భర్తీ అయ్యాయి.
సగానికిపైగా బీసీలే..
డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు దరఖాస్తు చేసిన వారు, సీట్లు పొందిన వారు సగానికి పైగా బీసీలే ఉన్నారు. సీట్లు పొందిన వారిలో 1,07,676 మంది బీసీలు. ఓసీలు 31,515 మంది ఉండగా, ఎస్సీలు 29,285, ఎస్టీలు 15,681 మంది ఉన్నారు.
5 నుంచి 7 వరకు డిగ్రీ స్పెషల్ కౌన్సెలింగ్
Published Sun, Jul 1 2018 2:59 AM | Last Updated on Sun, Jul 1 2018 2:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment