
గతేడాదికన్నా ఘనంగా బోనాలు
♦ అధికారులకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆదేశం
♦ పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసానితో కలసి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా హైదరాబాద్‌లో జరుపుకునే బోనాలు పండుగను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. గతేడాదికన్నా ఘనంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి గురువారం సచివాలయంలో బోనాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. రాష్ట్ర పండుగైన బోనాల పండుగ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని తలసాని పేర్కొన్నారు. జూలై 17న బోనాలు హైదరాబాద్‌లో ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి హోం, ఎక్సైజ్ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.
జూలై 24, 25 తేదీల్లో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవస్థానంలో జరిగే బోనాల పండుగకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. సీనియర్ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి అవసరమైన పనులను గుర్తించి వెంటనే చేపట్టాలని మహమూద్ అలీ, తలసాని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున దేవాలయాల పరిసరాల్లో మొబైల్ టాయిలెట్లు, రోడ్లకు మరమ్మతులు, విద్యుత్ అలంకరణలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక బస్సుల ఏర్పాటు, హోర్డింగ్‌లు, సినిమా థియేటర్లలో ప్రకటనల ద్వారా ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర అంశాలపై వారు ఆదేశాలు జారీ చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జూలై 5న కల్యాణోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయాలవారీగా కమిటీలు వేసుకొని పండుగను విజయవంతంగా నిర్వహించుకోవాలన్నారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, సమాచార, పౌరసంబధాలశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు అధికారులు శ్రీనివాస్, సుమతి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ హరిచందన, అగ్నిమాపకశాఖ అదనపు డెరైక్టర్ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.