
వలసపోయిన సర్పంచ్.. ఉప సర్పంచ్
పల్లె అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందో.. ఉపాధి నిమిత్తమో తెలి యదు కానీ గ్రామాన్ని విడిచి గల్ఫ్‌బాట పట్టారు.
ఇద్దరూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే
- గల్ఫ్‌కు వెళ్లడంతో కుంటుబడిన గ్రామాభివృద్ధి
- అస్తవ్యస్తంగా పారిశుధ్యం పనిచేయని తాగునీటి పథకాలు
- ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నతాధికారులకు కార్యదర్శి ఫిర్యాదు
సాక్షి, జగిత్యాల/ గొల్లపల్లి: పల్లె అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందో.. ఉపాధి నిమిత్తమో తెలి యదు కానీ గ్రామాన్ని విడిచి గల్ఫ్‌బాట పట్టారు. ఆరు నెలల క్రితం ఉప సర్పంచ్.. 50 రోజుల క్రితం సర్పంచ్ ఇలా ఒకరి తర్వాతా మరొకరు పరాయిదేశానికి పయనమయ్యా రు. గ్రామప్రథమ, ద్వితీయ పౌరులిద్దరూ అందుబాటులో లేకపోవడంతో గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. పారిశుధ్యలోపం.. వివిధ పథకాల బిల్లుల చెల్లింపులు నిలిచాయి. తాగునీటి పథకాలు పడకేశాయి. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి కూడా లేకపోవడంతో ఐతుపల్లి పంచాయతీ కార్యదర్శి వాజిద్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. అత ను వారంలో ఓ రోజు గ్రామానికి వచ్చి వెళ్తుం టాడని.. గ్రామసమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామపంచాయతీలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెగడపల్లి మండల పరిధిలో ఉన్న లక్ష్మీపూర్ జిల్లా పునర్విభజనలో గొల్లపల్లి మండలంలో చేరింది. పంచాయతీ పరిధిలో పది వార్డులు.. 2120 జనాభా ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ రాగా.. ఓ వార్డు సభ్యుడికి బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మానాల సురేశ్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఇటీవల అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఉప సర్పంచ్‌గా చింతపండు రమేశ్ ఎన్నికయ్యా రు. ఇద్దరూ టీఆర్‌ఎస్‌కి చెందిన వాళ్లే. గ్రామంలోని సమస్యలు.. అందుబాటులో లేని సర్పం చ్.. ఉపసర్పంచ్ గురించి ఇన్‌చార్జీ కార్యదర్శి వాజిద్ ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులే వెళ్లేలా చేశాయా?
సర్పంచ్ సురేశ్ ఊరు విడిచి గల్ఫ్‌కు వెళ్లడానికి ఆర్ధిక ఇబ్బందులే కారణమనే చర్చ గ్రామంలో జరుగుతోంది. రిజర్వేషన్ అవకాశం కలిసిరావడంతో సురేశ్(25) ఎన్నికల్లో పోటీ చేసి గెలిపొందారు. యువకుడు కావడంతో సురేశ్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేకచొరవ తీసుకునేవాడు. కానీ 50 రోజుల క్రితం అతడు ఊరు విడిచి దుబాయ్‌కు వలస వెళ్లారు. ‘గతంలో ఊర్లో మాకు పది గుంటల వ్యవసాయభూమి ఉండేది. కానీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు డబ్బులు అవసరమైనయ్. గ్రామ సర్పంచ్‌గా గెలిచిన తర్వాత భూమి అమ్మి అప్పులు తీర్చేసినం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఎండాకాలంలో ప్రజల దాహార్తి తీర్చేం దుకు సురేశ్ రూ. 3.50 లక్షలు అప్పులు చేసి గ్రామంలో బావి తవ్వించారు. పంచాయతీ నుంచి రూ. 90 వేలు మాత్రమే వచ్చాయి.
అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరగడం.. ఆర్థిక సమస్యలు ఉండడం తో దుబాయ్‌కు వెళ్లారు.’ అని సురేశ్ భార్య మంగ, అన్న మహేశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన సురేశ్.. ‘ నేను గ తంలో దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేశా.. డ్రైవింగ్ లెసైన్స్ గడువు ముగిసింది. రెన్యూవల్ కోసం ఇక్కడికి వచ్చా. నెలాఖరులోగా ఊరికి తిరిగి వచ్చేస్తా’ అన్నాడు. ఉపసర్పంచ్ రమేశ్ మాత్రం ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
పడకేసిన పాలన..
గ్రామ ప్రథమ.. ద్వితీయ పౌరులిద్దరూ లేకపోవడంతో అభివృద్ధిపరంగా లక్ష్మీ‘పూర్’గా మారింది. ఎటు చూసినా డ్రైనేజీలు నిండుకుండలా తయారై.. దుర్గందం వెదజల్లుతోంది. వీధి దీపాలు లేక గ్రామంలో అనేక వార్డుల్లో అంధకారంలో మగ్గుతున్నాయి. తాగునీటి సమస్య తీర్చేందుకు సురేశ్ తవ్వించిన బావి మోటరు పాడవడంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి మళ్లీ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు చేతిబావుల్లో నీరు రావడంతో కొన్నిప్రాంతాల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. బిల్లులకు సర్పంచ్ సంతకం అవసరం కాగా సురేశ్ అందుబాటులో లేకపోవడంతో 40 మంది బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. సఫాయి కార్మికులకు వేతనాలు సైతం నిలిచిపోయాయి. కాగా, సర్పంచ్, ఉప సర్పంచ్ లేక.. గ్రామ పరిపాలన కుంటుపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ దావు సత్తయ్య ప్రభుత్వాన్ని కోరారు.