గుండంరాజుపల్లి ఉప సర్పంచ్ వెంకన్నపై దాడికి పాల్పడుతున్న సీపీఎం, కాంగ్రెస్ నాయకులు
మరిపెడ(డోర్నకల్): చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి సర్పంచ్ ఉప ఎన్నిక సోమవారం ఉద్రిక్తత మధ్య జరిగింది. గుండంరాజుపల్లిలోని జెడ్పీ హైస్కూల్‌లో ఉదయం పోలింగ్ ప్రారంభం కాగా సీపీఎంకు చెందిన వార్డు సభ్యురాలు కుర్ర సువర్ణ ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తుండటాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు చూశారు. దీంతో ఆగ్రహించి పోలింగ్‌స్టేషన్–2లోకి దూసుకువెళ్లి ఈవీఎంకు ఉన్న బ్యాలెట్ యూనిట్‌ను కింద పడేసి ధ్వంసం చేశారు. వేసిన ఓట్లు నిల్వ ఉండే కంట్రోల్ యూనిట్‌ను విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది చాటుగా దాచారు. టీఆర్‌ఎస్ నాయకులు సుమారు అరగంటపాటు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు వార్డు సభ్యురాలిని ఎన్నికల విధుల నుంచి తొలగించి మరొకరికి అప్పగించగా పోలింగ్ సజావుగా సాగింది.
గుండంరాజుపల్లి సర్పంచ్‌గా లలిత గెలుపు..
గుండంరాజుపల్లి సర్పంచ్ స్థానానికి మొత్తం 968 ఓట్లకు 824 పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి మేడ లలితకు 464 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి మనుపాటి ఉపేంద్రకు 358ఓట్లు వచ్చాయి. దీంతో 106ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి లలిత గెలుపొందారు. సర్పంచ్‌కు పోలింగ్‌స్టేషన్ –1లో 2, పోలింగ్‌స్టేషన్–2లో 2 నోటాకు వేశారు.
రిగ్గింగ్‌కు పాల్పడ్డారు..
టీఆర్‌ఎస్ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జాటోతు రాంచంద్రునాయక్ ఆరోపించారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ తమ అభ్యర్థి గెలిచే నమ్మకం లేకనే అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా పోలింగ్‌కేంద్రంలోకి దూసుకువెళ్లి ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారితోపాటు ఈవీఎంలను ధ్వంసం చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉప సర్పంచ్‌పై దాడి..
గుండంరాజుపల్లి సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి లలిత గెలుపొందిన తర్వాత కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తనయుడు రవిచంద్రకు చెందిన మిల్ట్రీ జీపు వస్తుండగా చూసి ముందుఅద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. కానీ అందులో డ్రైవర్, టీఆర్‌ఎస్ కార్యకర్త ఉండగా, వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇంతలో పోలింగ్ కేంద్రానికి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గ్రామ ఉపసర్పంచ్ గునిగంటి వెంకన్న స్నేహితుడు గునిగంటి కృష్ణతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారు. వెంకన్న తలకు గాయం కాగా, కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. వారు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతున్నారు. దీంతో గ్రామంలో రెండురోజులపాటు 144 సెక్షన్ విధించినట్లు తొర్రూర్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. గెలిచిన వారు ఎలాంటి ర్యాలీలు తీయొద్దని సూచించారు. పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రెడ్యానాయక్ పరామర్శ..
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల దాడిలో గాయపడిన చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి ఉపసర్పంచ్ గునిగంటి వెంకన్న, టీఆర్‌ఎస్ నాయకులు గునిగంటి కృష్ణ మానుకోట ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ రాంచంద్రునాయక్ ఆధ్వర్యం లో దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. తన కుమారుడి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని తెలిపారు. ఎమ్మెల్యేతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, మరిపెడ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ తాళ్లపల్లి రాణిశ్రీనివాస్, డోర్నకల్ మాజీ ఎంపీపీ వాంకుడోత్ వీరన్న, టీఆర్‌ఎస్ గుండంరాజుపల్లి గ్రామ అధ్యక్షుడు జక్కుల ఐలయ్య ఉన్నారు.
చిన్నగూడూరు 8వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు
చిన్నగూడూరులోని ఎనిమిదో వార్డుకు టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కొమ్ము ఎల్లమ్మ, కాంగ్రెస్ పార్టీ తరఫున బొల్లు సంతోష బరిలో ఉన్నారు. మొత్తం 210 ఓట్లకు 193 ఓట్లు పోలయ్యాయి. ఎల్లమ్మకు 101 ఓట్లు, సంతోషకు 88 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్లమ్మ 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నోటాకు నాలుగు ఓట్లు వేశారు.
గుర్తూరు టీఆర్‌ఎస్‌దే..
తొర్రూరు రూరల్: మండలంలోని గుర్తూరు గ్రామంలో సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. గుర్తూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవరకొండ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి మోత్కూరి రవీంద్రాచారిపై 326 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పదో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి వెల్తూరి యాకయ్య సమీప అభ్యర్థి ఈదునూరి ఎల్లమ్మపై వంద ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సర్పంచ్ స్థానానికి 90శాతం పోలింగ్ నమోదు కాగా, పదో వార్డుకు 84 శాతం ఓట్లు పోలయ్యాయి. సర్పంచ్ ఎన్నికలో మొత్తం 2,120ఓట్లకు 1,788 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవరకొండ శ్రీనివాస్‌కు 1,043, కాంగ్రెస్ అభ్యర్థి మోత్కూరి రవీంద్రాచారికి 717ఓట్లు వచ్చాయి. నోటాకు 28 ఓట్లు పడ్డాయి. పదో వార్డులో 212 ఓట్లకుగాను టీఆర్‌ఎస్ అభ్యర్థి వెల్తూరి యాకయ్యకు 141 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఈదునూరి ఎల్లమ్మకు 41 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 4 ఓట్లు పడ్డాయి. గెలిచిçన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు యుగేందర్, ఎంపీడీఓ గుండె బాబులు ధ్రువీ కరణ పత్రాలను అందజేశారు. గ్రామ పురవీధుల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
తీగలవేణి పదో వార్డు కాంగ్రెస్ కైవసం
గూడూరు: మండలంలోని తీగలవేణి గ్రామ పంచాయతీ పదోవార్డు ఉప ఎన్నిక సోమవారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్య బాల గెలుపొందారు. ఈ వార్డు సభ్యుడు గతంలో గ్రామంలో ఖాళీ అయిన ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 200 ఓట్లకు 196 పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి భూక్య బాలకు 106, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈర్యానాయక్‌కు 72 ఓట్లు వచ్చాయి. ఈర్యానాయక్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్య బాల 34 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి సోయం ప్రసాదరావు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థికి ఆరు, నోటాకు 8 ఓట్లు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్‌మాయమాటలతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని ఎంపీపీ ఎంపీపీ చెల్పూరు వెంకన్న అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే నమ్మకం కలిగిందని చెప్పారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూనావత్ రమేష్, వేం శ్రీనివాస్‌రెడ్డి, ఎండి.యాకూపాషా, దేవానాయక్, చిట్టె వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment