సంప్రదాయం ప్రకారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయించాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించారు.
విపక్షాలకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయం ప్రకారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయించాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించారు. డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా పద్మా దేవేందర్‌రెడ్డి పేరును ఇప్పటికే ఖరారుచేశామన్నారు. విపక్ష నేతలు గీతారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్(బీజేపీ) బుధవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌ను కలిశారు. పార్లమెంట్ సంప్రదాయాల ప్రకారం అధికార పక్షానికి స్పీకర్, విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సి ఉందని ప్రతిపాదించారు.
అందులో భాగంగానే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు తామంతా అధికార పక్షానికి సంపూర్ణ సహకారం అందించామని గుర్తు చేశారు. విపక్ష పార్టీల్లో డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా సహకరిస్తామని చెప్పారు. కేసీఆర్ మాత్రం వారి ప్రతిపాదనను తిరస్కరించారు. టీఆర్‌ఎస్ తరపున పద్మాదేవేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశామని, ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో విపక్ష నేతలు ‘ఈ విషయాన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాం’ అని పేర్కొంటూ బయటకు వచ్చేశారు.