
విద్యతోనే వికాసం
సమాజంలో దశాబ్దాల తరబడి అణచివేతకు గురైనవారి జీవితాలలో విద్యతోనే సమూల మార్పు వస్తుందని తెలంగాణ గురుకులాల సంఘం కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన భీమ్‌గల్‌లోనూ, ఆర్మూరు మండలం సుర్బిర్యాలలోనూ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించారు. వీటిని గురుకుల పాఠశాలల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేశారు.
ఆర్మూర్ టౌన్ : సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైనవారి జీవితాల్లో విద్యతోనే మార్పు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విభాగం కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు లక్ష్యం ఇదేనన్నారు. ఆదివారం సుర్బిర్యాల్‌లో స్వేరోస్( ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బాణాలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పూర్వ విద్యార్థులు) సంస్థ ఆధ్వర్యంలో, గ్రామవాసి డాక్టర్ రాజేశ్వర్ సౌజన్యంతో అంబేద్కర్ విజ్ఞాన కేం ద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించని దేశాలు బాగుపడవన్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించాలని సూచించారు. సాహసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఇందుకు గురుకుల విద్యార్థులు మాలవత్ పూర్ణ, ఆనంద్ సాక్ష్యమన్నారు.
ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..
టీవీలు చూస్తూ, సినిమాల గురించి చర్చించుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. లక్ష్యాలను నిర్దేశించుకుని, దానిని చేరేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలి.
తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను గౌరవించాలని, వారి ఆలోచనా విధానాలను గుర్తించి సక్రమ మార్గంలో నడిపించాలి.
పిల్లలకు మహనీయుల జీవితాలను వివరించాలి. తద్వారా వారిలో తాము ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష బలోపేతమవుతుంది.
పిల్లలను నిరుత్సాహ పరచవద్దు. వారిపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది.
తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచే సుగుణాలను అలవర్చాలి.
పిల్లలపై ప్రేమతో ఇంటివద్దనే చదివించాలని చూడవద్దు. అవసరమైతే వారిని దూర ప్రాంతానికి పంపి చదివించడానికీ వెనుదీయవద్దు.
కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌ను డాక్టర్ రాజేశ్వర్ సన్మానించారు. ఈ సందర్భంగా పోచంపాడ్, కంజర గురుకుల పాఠశాలల విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో సర్పంచ్ భారతి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సత్తెమ్మ లింగారెడ్డి, నందిపేట తహశీల్దార్ బావయ్య, పీఆర్ ఏఈ రాజేశ్వర్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా అధ్యక్షుడు రాజన్న, వైద్యులు బాబూరావు, ప్రవీణ్, ఐఆర్‌ఎస్ సాధించిన మదన్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకమే ప్రపంచం కావాలి
భీమ్‌గల్ : విద్యార్థికి పుస్తకమే ప్రపంచం కావాలని, చదువే సర్వస్వమవ్వాలని రాష్ర్ట సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆదివారం ఆయన భీమ్‌గల్‌లోని ముచ్కూర్ రోడ్‌లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మంచి పుస్తకాలు జీవితాన్నే మార్చేస్తాయన్నారు.
మహాత్ముల జీవిత చరిత్రల ద్వారా జీవన శైలిని మార్చుకోవచ్చని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. చిన్నప్పటినుంచే చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చక్కగా చదివితే ఉద్యోగాలు వాటంతటవే వస్తాయన్నారు. ఈ విజ్ఞాన కేంద్రాన్ని మరింత విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ రవినాయక్, డిచ్‌పల్లి ఎంఈఓ సాయిలు, ప్రొఫెసర్ సుధాకర్, డాక్టర్లు అశోక్, ప్రేమానందం, రాజన్న తదితరలు పాల్గొన్నారు.