టేకాఫ్‌.. మహాస్పీడ్‌ | Development in Flight Journey Passengers From RGIA | Sakshi
Sakshi News home page

టేకాఫ్‌.. మహాస్పీడ్‌

Published Sat, Jan 4 2020 8:28 AM | Last Updated on Sat, Jan 4 2020 8:28 AM

Development in Flight Journey Passengers From RGIA - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులు క్షణాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. హైదరాబాద్‌ నుంచి అనేక జాతీయ, అంతర్జాతీయ నగరాలకు పెరిగిన విమాన సదుపాయాలతో ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణ భారతానికి ప్రధాన ముఖద్వారంగా ఉన్న హైదరాబాద్‌ నుంచి 55 ప్రధాన నగరాలకు నేరుగా ఫ్లైట్‌ కనెక్టివిటీ ఉంది. మరోవైపు పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలుచార్జీలపైన ఇస్తున్న రాయితీలు, ఆఫర్లు  కూడా ప్రోత్సహిస్తున్నాయి. తరచుగా ఫ్లైట్‌ చార్జీలు రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ చార్జీలతో  సమానంగా ఉంటున్నాయి. దీంతో గంటలతరబడి రైళ్లలో ప్రయాణించడానికి బదులు నగరవాసులు ఫ్లైట్‌ జర్నీనే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 2.13 కోట్ల మంది పయనించగా వారిలో 1.74 కోట్ల మంది డొమెస్టిక్‌ ప్రయాణికులు. మరో 39 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు.

గతేడాదితో పోల్చుకుంటే జాతీయ ప్రయాణికుల పెంపుదల 10 శాతం వరకు నమోదు కాగా, అంతర్జాతీయ ప్రయాణికుల పెంపుదల 9 శాతంవరకు నమోదైనట్లు జీఎమ్మార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు దిల్లీ, ముంబయి, బెంగళూర్, కోల్‌కత్తా, చెన్నై నగరాలకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లలో కనీసం 12 గంటల నుంచి 16  గంటల పాటు ప్రయాణం చేస్తే తప్ప చేరుకోలేని నగరాలు ఇప్పుడు ఫ్లైట్‌లో కేవలం గంట నుంచి 2 గంటల వ్యవధికి తగ్గడం, నగరవాసుల్లో పెరిగిన కొనుగోలు శక్తి  ఇందుకు కారణం. హైదరాబాద్‌ నుంచి శబరికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు ఇప్పుడు ట్రైన్‌ జర్నీ కంటే ఫ్లైట్‌ జర్నీ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది కొత్తగా  గోరఖ్‌పూర్, గ్వాలియర్, బెల్గాం, మైసూర్, నాసిక్, తిరుచిరాపల్లి తదితర నగరాలకు ఫ్లైట్‌ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ప్రధాన అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్‌ నుంచి కనెక్టివిటీ ఉండడంవల్ల ఏటేటా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌కు  ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు.  

71 నగరాలు, 25 ఎయిర్‌లైన్స్‌...
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో 8 డొమెస్టిక్, 21 ఇంటర్నేషనల్‌  నగరాలతో ప్రారంభమైన సేవలు ఇప్పుడు 71 నగరాలకు విస్తరించాయి. 25 ఎయిర్‌లైన్స్‌  విమాన సర్వీసులను నడుపుతున్నాయి. రెండో రన్‌వే సైతం అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. మరోవైపు  పలు ఆసియా దేశాలకు కేవలం 5 గంటల వ్యవధిలో చేరుకొనే సదుపాయం ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలకు సైతం 2 గంటల్లోపే చేరుకోవచ్చు. ఏటా కొత్త నగరాలకు సర్వీసులు విస్తరిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఇందుకనుగుణంగానే ఎయిర్‌పోర్టును విస్తరిస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలోనూ ఫేషియల్‌ రికగ్నిషన్, బాడీస్కానింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement