అబిడ్స్, న్యూస్‌లైన్: ఈ ఎన్నికల్లో ‘మా పని.. మా నినాదం’ అనే అంశంతో ప్రజల ముందుకు వెళ్తామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తాము చేపట్టిన అభివృద్ధే తమ ప్రధాన ఎన్నికల ఆయుధమన్నారు. మంగళవారం దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో తమ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు.దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీలంతా తమ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారన్నారు.
ఏ పార్టీతోనూ పొత్తులేదు..
తెలంగాణ, సీమాంధ్రలో కూడా ఎంత మంది అభ్యర్థులను పోటీకి దింపుతున్నదీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని అసదుద్దీన్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో 2వ జాబితా విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంతో పాటు సీమాంధ్రలో కూడా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి హవా కొనసాగిస్తామన్నారు.
తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, ఒంటరిగానే వెళుతున్నట్టు ఆయన వివరించారు. తమతో పొత్తు పెట్టుకునేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చినా తాము అందుకు సుముఖంగా లేమని తెలిపారు. నాంపల్లి, కార్వాన్ అసెంబ్లీ స్థానాలలో కొత్తవారైనా విజయం సాధిస్తారన్నారు. కార్వాన్ నియోజకవర్గం ఓ నిరుపేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తుందని అసదుద్దీన్ ఓవైసీ వివరించారు. హైదరాబాద్ నుంచి తాను బరిలో దిగుతున్నట్టు చెప్పారు.
అభివృద్ధే మా ప్రచార ఆయుధం: అసదుద్దీన్
Published Wed, Apr 2 2014 12:15 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM
Advertisement
Advertisement