టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్
‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి - హైదరాబాద్’ పట్టభద్రుల స్థానానికి ఖరారు
నేడు ‘వరంగల్ - ఖమ్మం - నల్లగొండ’ అభ్యర్థిని ప్రకటించే అవకాశం
మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకుగాను తొలి అభ్యర్థిని అధికార టీఆర్‌ఎస్ ఖరారు చేసింది. ‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ’ నియోజకవర్గం నుంచి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్‌జీవో) అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరును ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పార్టీ నేతలతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంత్రులు, పార్లమెంటు కార్యదర్శులు, ఇతర కీలక నేతలతో మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమై సుమారు ఐదు గంటలపాటు అనేక అంశాలపై చర్చించారు. సాయంత్రం దేవీప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
కానీ ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గం విషయంలో మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదు. నాలుగు రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి పోటీ ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ మాజీ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. కానీ ఈలోగా వరంగల్ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రవీందర్‌రావు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ ఇద్దరినీ కాదని మధ్యే మార్గంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు.
పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం స్వయంగా అభ్యర్థి పేరును ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఆశావహులందరినీ అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తె లిసింది. కాగా దేవీప్రసాద్ తన పేరు ఖరారైనట్లు తెలియగానే కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా మండలి ఎన్నికలు
మండలి ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 4, 5 తేదీల్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులందరికీ నాగార్జునసాగర్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతోపాటు ఎమ్మెల్యే కోటాలో మరో ఆరు ఎమ్మెల్సీ పదవులకు మార్చిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో మరో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకూ ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్.. మండలి ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పార్టీ నేతలకు రెండు రోజులపాటు శిక్షణ ఇప్పించాలని భావించినట్లు తెలిసింది. ఈ శిబిరాలకు సుమారు 120 మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు సమాచారం.