trs mlc candidate
-
ఎమ్మెల్సీ అభ్యర్థి: వాహనం, అభరణాలు..గుంట భూమీ లేదు.. కానీ భార్య పేరిట..
సాక్షి, నల్లగొండ: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరిట వాహనాలు ఏమీ లేవు. గుంట భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. స్థిర, చరాస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరునే ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో తన, తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. గోపాలపురం పోలీసు స్టేషన్లో కేసు ఉన్నట్లు తెలిపారు. అలాగే కోర్టుల్లోనూ కేసులు ఉన్నట్లు వివరించారు. తన చేతిలో రూ. 1.5 లక్షలు, తన భార్య వద్ద రూ. 1.08 లక్షలు, అవిభక్త కుటుంబం వద్ద రూ.2,97,026 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట రూ. 83 లక్షలకు పైగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండగా, భార్య అరుంధతి పేరిట రూ.1.01 కోట్లు, అవిభక్త కుటుంబం పేరుతో రూ.1.72 కోట్లకుపైగా డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నట్లు వెల్లడించారు. వైడ్ బిజినెస్ సొల్యూషన్స్ పేరుతో రూ.6.4 లక్షలు, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో కొత్త పేటలో మహాలక్ష్మి థియేటర్ (ప్రస్తుత విలువ రూ.2.5 కోట్లు), అమిత్ఎంటర్ ప్రైజెస్(రూ.70 లక్షలు) ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున గానీ, తన భార్య పేరున గానీ ఎలాంటి వాహనాలూ లేవని తెలిపారు. తనకు ఆభరణాలు లేవని తెలిపారు. భార్య పేరిట రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2.5 లక్షల విలువైన 4 కిలోల వెండి, హిందూ అవిభక్త కుటుంబం పేరిట రూ.8.75 లక్షల విలువైన 175 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుఖేందర్‌రెడ్డి వివరించారు. భార్య పేరిట చిట్యాల, కేశంపల్లిలో 7.48 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిలీంనగర్‌లో 2389.5 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కలుపుకొని వాణిజ్య భవనం, చిట్యాలలో 3888 చదరపు అడుగుల వాణిజ్య భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. పుప్పాలగూడలో 473 చదరపు అడుగుల నివాస భవనం, చిట్యాలలో 3,600 చదరపు అడుగుల నివాస భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా వాటి విలువ రూ.5,89,13,480గా పేర్కొన్నారు. ఆయనకు చెందిన హిందూ అవిభక్త కుటుంబం పేరుతో ఊరుమడ్ల, దేవరకొండలో 39.72 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు వెల్లడించారు. ఊరుమడ్ల గ్రామకంఠంలో నాలుగు గుంటలు, మామిళ్లగూడ, నందిపహడ్లో 1012 చదరపు గజాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తన పేరిట రూ.36,57,500, భార్య పేరిట రూ.1,20,04,000, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో రూ.1,32,07,566 లోన్లు తీసుకున్నట్లు తెలిపారు. · భార్య పేరిటనే స్థిరాస్తులు · ఎమ్మెల్సీ నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న సుఖేందర్‌రెడ్డి -
ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయం
నల్లగొండ రూరల్ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్తో తలపడుతున్న ప్రత్యర్థ పార్టీలకు డిపాజిట్ గల్లంతవడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ద్రోహులైన బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో కోలాహలంగా జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ వేయడానికి ముందు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మూడు జిల్లాల నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వారు ప్రసంగించారు. ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకలాగానే సునాయసంగా గెలుస్తామన్న దీమా వ్యక్తం చేశారు. వ రంగల్ జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ సాధిస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో భారీ జాబ్‌మేళా ఉండబోతుందని తెలిపారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు, అధ్యాపకులకు ఈ ఎన్నికలు అండగా నిలుస్తాయన్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీకి వస్తున్న పార్టీలకు పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నుట్ల తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై అవగాహన వున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా మేలు జరుగుతుందన్నారు. కమలనాథన్ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ర్టంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలు తెలంగాణ ద్రోహులని.. సుధీర్ఘపోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలోని ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుట్రతో ఆంధ్రాలో కలిపారని విమర్శించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. విజయం మనదే అయినప్పటికీ మంచి మెజార్టీ సాధించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులతో విడదీయలేని అనుబంధం ఉందని, తనను గెలిపిస్తే వారి ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, తదితర ప్రాజెక్టుల ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. త్వరలోనే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతిసాగర్, జెడ్పీచైర్మన్ బాలునాయక్, పార్లమెంటరీ కార్యదర్శులు గాదరి కిషోర్, జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, నాయకులు చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి, దాసోజు శంకరమ్మ, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, నోముల నర్సింహయ్య, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యావతిరాథోడ్, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఉద్యోగులూ మద్దతిస్తారు: దేవీప్రసాద్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు తనను వ్యతిరేకిస్తారనడంలో వాస్తవం లేదని టీఎన్జీవో మాజీ నేత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఉద్యోగులు కూడా తనకు మద్దతిస్తారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బుధవారం ఉదయం నామినేషన్ దాఖలుచేయనున్నట్లు తెలిపారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్
‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి - హైదరాబాద్’ పట్టభద్రుల స్థానానికి ఖరారు నేడు ‘వరంగల్ - ఖమ్మం - నల్లగొండ’ అభ్యర్థిని ప్రకటించే అవకాశం మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకుగాను తొలి అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ ఖరారు చేసింది. ‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ’ నియోజకవర్గం నుంచి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరును ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పార్టీ నేతలతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంత్రులు, పార్లమెంటు కార్యదర్శులు, ఇతర కీలక నేతలతో మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమై సుమారు ఐదు గంటలపాటు అనేక అంశాలపై చర్చించారు. సాయంత్రం దేవీప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కానీ ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గం విషయంలో మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదు. నాలుగు రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి పోటీ ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ మాజీ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. కానీ ఈలోగా వరంగల్ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ ఇద్దరినీ కాదని మధ్యే మార్గంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం స్వయంగా అభ్యర్థి పేరును ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఆశావహులందరినీ అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తె లిసింది. కాగా దేవీప్రసాద్ తన పేరు ఖరారైనట్లు తెలియగానే కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా మండలి ఎన్నికలు మండలి ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 4, 5 తేదీల్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులందరికీ నాగార్జునసాగర్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతోపాటు ఎమ్మెల్యే కోటాలో మరో ఆరు ఎమ్మెల్సీ పదవులకు మార్చిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో మరో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకూ ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్.. మండలి ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పార్టీ నేతలకు రెండు రోజులపాటు శిక్షణ ఇప్పించాలని భావించినట్లు తెలిసింది. ఈ శిబిరాలకు సుమారు 120 మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు సమాచారం.