నల్లగొండ రూరల్ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో తలపడుతున్న ప్రత్యర్థ పార్టీలకు డిపాజిట్ గల్లంతవడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ద్రోహులైన బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో కోలాహలంగా జరిగిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ వేయడానికి ముందు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మూడు జిల్లాల నుంచి తరలివచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వారు ప్రసంగించారు.
ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు నల్లేరుపై నడకలాగానే సునాయసంగా గెలుస్తామన్న దీమా వ్యక్తం చేశారు. వ రంగల్ జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ సాధిస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో భారీ జాబ్‌మేళా ఉండబోతుందని తెలిపారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు, అధ్యాపకులకు ఈ ఎన్నికలు అండగా నిలుస్తాయన్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీకి వస్తున్న పార్టీలకు పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నుట్ల తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై అవగాహన వున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా మేలు జరుగుతుందన్నారు. కమలనాథన్ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ర్టంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.
మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలు తెలంగాణ ద్రోహులని.. సుధీర్ఘపోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలోని ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుట్రతో ఆంధ్రాలో కలిపారని విమర్శించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. విజయం మనదే అయినప్పటికీ మంచి మెజార్టీ సాధించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులతో విడదీయలేని అనుబంధం ఉందని, తనను గెలిపిస్తే వారి ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, తదితర ప్రాజెక్టుల ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు.
త్వరలోనే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతిసాగర్, జెడ్పీచైర్మన్ బాలునాయక్, పార్లమెంటరీ కార్యదర్శులు గాదరి కిషోర్, జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, నాయకులు చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి, దాసోజు శంకరమ్మ, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, నోముల నర్సింహయ్య, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యావతిరాథోడ్, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయం
Published Thu, Feb 26 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement