మాకేం గుర్తులేదు.. తెలియదు.. | Devika Rani Not Cooperate With The ACB | Sakshi
Sakshi News home page

మాకేం గుర్తులేదు.. తెలియదు..

Published Mon, Nov 11 2019 4:58 AM | Last Updated on Mon, Nov 11 2019 4:58 AM

Devika Rani Not Cooperate With The ACB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల గోల్‌ మాల్‌ నిందితులు ఏసీబీకి సహకరించడం లేదు. ఏ ప్రశ్న అడిగినా.. తెలియదని, గుర్తులేదని చెబుతున్నారు. ఈ కేసులో ఇటీవల రెండో కేసు నమోదు చేసిన ఏసీబీ నిందితులను 3 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ కలకుంట్ల పద్మ, వసంత్‌ ఇందిరా, ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ నాగరాజులను శనివారం ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.

తొలిరోజు ఏసీబీ ప్రశ్నలపై నోరు మెదపని నిందితులు, రెండోరోజైన ఆదివారం అదే పంథా అనుసరించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు మౌనంగా ఉండటం, గుర్తులేదు, తెలియదు అంటూ సమాధానాలు దాటవేయడంతో విచారణాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

రెండోసారి చాలా మార్పు..
తొలుత కస్టడీలోకి తీసుకున్నపుడు నిందితులు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, విచారణకు సహకరించారని, పలు సందర్భాల్లో చేసిన తప్పులను తలచుకుని ఏడ్చారని గుర్తు చేశారు. మాజీ జేడీ పద్మ అయితే.. చంచల్‌గూడ జైల్లో అధిక మొత్తంలో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. రెండోసారి విచారణలో నిందితులు వ్యూహాత్మకంగా, తెలివిగా సమాధానాలు దాటేయడం అధికారులకు ఇబ్బందిగా మారింది. డొల్ల కంపెనీలపై రెండో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు డొల్ల కంపెనీలు ఎలా నిర్వహించారు, మెడికల్‌ కిట్లు ఎలా పంపారు? ధర ఎవరు నిర్ణయించారు? రేటెడ్‌ కంపెనీ(ఆర్‌సీ)లను వదిలి.. నాన్‌రేటెడ్‌ (ఎన్‌ఆర్‌సీ) కంపెనీల వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది.

ఆర్‌సీ కంపెనీలకు బిల్లులు ఎందుకు పెండింగ్‌ పెట్టారు? అన్న విషయాలపై ప్రశ్నించినా.. దేవికారాణి, పద్మలు సమాధానాలు గుర్తులేవని చెప్పినట్లు సమాచారం. ఇక బంగారు ఆభరణాల విషయం గురించి, ఓ జ్యువెల్లరీ షోరూంలోనే ఎందుకు బంగారం కొనాల్సి వచి్చంది? ఆ మొత్తాన్ని ఎలా చెల్లించారు? అన్న ప్రశ్నలకు దేవికారాణి మౌనం వహించినట్లు తెలిసింది. ఇక సాయంత్రం నిందితులందరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. మొత్తం కుంభకోణం విలువ రూ.700 కోట్లపైమాటే అని ఈఎస్‌ఐ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో సేకరించింది చాలా తక్కువని, తవ్వాల్సిన అక్రమాలు చాలా ఉన్నాయంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement