హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖలో అవినీతిని పూర్తిగా నిర్మూలించామని ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చంచల్‌గూడలోని స్టేట్ ఇన్స్‌ట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్(సీకా) కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అవినీతిరహిత శాఖగా జైళ్ల శాఖ రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ శాఖను అవినీతిరహితంగా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తాము చేపట్టిన సర్వేలో జైళ్లలో అవినీతి చాలా వరకూ అంతం అయ్యిందన్న విషయం స్పష్టమైందన్నారు. జైళ్ల శాఖలో అవినీతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసుశాఖ, ఇంటెలిజెన్స్ సంస్థలను కోరగా వారి నుంచి ఎలాంటి వ్యతిరేక నివేదిక రాలేదన్నారు.
ఈ క్రమంలోనే జైళ్ల శాఖను అవినీతిరహిత శాఖగా ప్రకటించడానికి సాహసం చేశామన్నారు. భవిష్యత్తులో ఈ శాఖలో ఏదైనా అవినీతి జరిగిందని తెలిస్తే తానే బాధ్యత వహిస్తానని డీజీ స్పష్టం చేశారు. చంచల్‌గూడ జైలు పరిసరాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జి ఐజీ ఎం.చంద్రశేఖర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.