పోలీస్ ఆత్మహత్యలపై అధ్యయనం
ఐపీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో వరసగా చోటుచేసుకుంటున్న సిబ్బంది ఆత్మహత్యలపై డీజీపీ అనురాగ్ శర్మ దృష్టి సారించారు. ఆత్మహత్యలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో భేటీ అయ్యారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులు, సిబ్బందిలో ఉన్న ఒత్తిడి నివారణ, మానసిక కుంగుబాటు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
దీనిపై శిక్షణ విభాగం ఐజీ చారుసిన్హా నేతృత్వంలో అధికారులు కలసి పనిచేయాలని, ఒత్తిడి నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆలోచనలను చారుసిన్హాకు తెలియజేయాలని అధికారులకు డీజీపీ సూచించారు. అలాగే తీసుకోవాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక కూడా తయారుచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పలువురు పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.