వజ్రోత్సవ వెలుగులు | Diamond Light | Sakshi
Sakshi News home page

వజ్రోత్సవ వెలుగులు

Published Tue, Jun 17 2014 3:06 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

వజ్రోత్సవ వెలుగులు - Sakshi

వజ్రోత్సవ వెలుగులు

సరిగ్గా అరవై ఏళ్ల క్రితం.. సామాన్యులకు చదువు అందుబాటులో లేని రోజులవి. అప్పట్లో తెలంగాణ పల్లెలన్నీ విద్యాపరిమళానికి దూరంగా ఉన్నాయి.

  •   ఎందరో జీవితాలకు మలుపు  
  •    అదే రెడ్డి మహిళా కళాశాల ఘనత
  •    రాజా బహదూర్ చొరవతో ఏర్పాటు  
  •    దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిన కాలేజీ
  •    లక్షల మందికి విద్యాదానం  
  •    60 వసంతాల వేడుకలకు ముస్తాబు
  •    రేపు లోగో ఆవిష్కరణ
  • సాక్షి, సిటీబ్యూరో: సరిగ్గా అరవై ఏళ్ల క్రితం.. సామాన్యులకు చదువు అందుబాటులో లేని రోజులవి. అప్పట్లో తెలంగాణ పల్లెలన్నీ విద్యాపరిమళానికి దూరంగా ఉన్నాయి. అలాంటి రోజుల్లో అమ్మాయిల చదువులు ఊహాతీతం. పైగా తెలుగు మాధ్యమంలో ఉన్నత చదువులు అనితరసాధ్యం. అలాం టి చీకటి రోజుల్లో విద్యాజ్యోతిని వెలిగించిన మహా ప్రదాత రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా ఆయన వెలిగించిన ఆ జ్యోతి తెలంగాణ అంతటికీ వెలుగులను విరజిమ్మింది. అరవై ఏళ్లుగా లక్షలాది మంది గ్రామీణ ప్రాంత  అమ్మాయిలకు ఉన్నత విద్యను అందజేస్తోంది.

    ఈ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. రెడ్డి విమెన్స్ కాలేజీగా ప్రాచుర్యంలో ఉన్న రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల (ఆర్‌బీవీఆర్‌ఆర్) అన్ని వర్గాల వారికీ విద్యను అందజేస్తోంది. వజ్రోత్సవ సంబరాలకు సన్నద్ధమైన ఆర్‌బీవీఆర్‌ఆర్‌పై ప్రత్యేక కథ నం.
     
    అప్పట్లోనే హైదరాబాద్ మహిళా విద్యా సంఘం...

    నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వంలో కొత్వాల్‌గా విధులు నిర్వహించి 1930లోనే పదవీ విరమణ చేసిన రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి ఆ  తరువాత తన జీవిత కాలాన్ని విద్య కోసమే కేటాయించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో ఉన్నత విద్యకు ఆద్యుడిగా నిలిచారు. 1950లో మహిళల కోసం ఏర్పడిన కోఠి విమెన్స్ కాలేజీ తప్ప మరో కళాశాల లేదు. అలాంటి సమయంలో హైదరాబాద్ మహిళా విద్యా సంఘా న్ని ఏర్పాటు చేశారాయన. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చైర్మన్‌గా ఈ సంఘం ఆవిర్భవించింది.

    ఈ సంఘం కృషితోనే 1954లో రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి కళాశాల నారాయణగూడలో ఏర్పడింది. మొదట్లో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులుండేవి. తరువాత కళాశాల సేవలు విస్తరించాయి. గ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులనూ ప్రారంభించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాల గ్రామీణ ప్రాంతాల  అమ్మాయిలకు 60 శాతం సీట్లను, మిగతా 40 శాతం పట్టణ ప్రాంతాల వారికి కేటాయించారు.

    ఆ తరువాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినులకు   అవకాశాలు పెరిగాయి. కాలేజీ విజయవంతంగా నడుస్తున్న రోజుల్లోనే అప్పటి ఉపముఖ్యమంత్రి  కొండా వెంకటరంగారెడ్డి షష్టి పూర్తి సందర్భంగా వచ్చిన లక్ష రూపాయలతో విద్యార్థినులకు ఉచిత వసతి సదుపాయాన్ని ప్రారంభించారు.

    ఎప్పటికప్పుడు కొత్త కోర్సులతో విద్యార్థినులకు చేరువవుతున్న రెడ్డి విమెన్స్ కాలేజ్ యూజీసీ అనుబంధ నాక్ గుర్తింపును పొందింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థగా వెలుగొందుతోంది. ప్రస్తుతం రెండు వేల మంది డిగ్రీ కోర్సులు చేస్తుండగా, 500 మందికి  పైగా పీజీ కోర్సులో చదువుతున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ వంటి కొత్త కోర్సులను ఈ కళాశాలలో  ప్రారంభిస్తూ మహిళలకు ఉద్యోగ, ఉపాధికి భరోసానిస్తోంది ఈ కళాశాల.
     
    రేపు డైమండ్ జూబ్లీ లోగో ఆవిష్కరణ

    1954లో ప్రారంభమైన కళాశాల 2014తో  60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది పొడవునా విద్యారంగానికి సంబంధించిన అనేక అంశాలపై సదస్సులు, వర్క్‌షాపులు, ఇష్టాగోష్టులు నిర్వహించనున్నట్టు ఆ కళాశాల గౌరవ కార్యదర్శి తిప్పారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహిళా విద్యాసంఘం చైర్మన్, జస్టిస్ సుదర్శన్‌రె డ్డి ఈ సందర్భంగా వజ్రోత్సవ లోగోను ఆవిష్కరించనున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement