డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండల కేంద్రంలోని 44 నెంబరు జాతీయ రహదారి నాగ్‌పూర్ రైల్వే గేటు నుంచి నిజామాబాద్ వరకు ఉన్న బీటీ రోడ్డుకు ఎట్టకేలకు ఫోర్‌లేన్ రోడ్డుగా మోక్షం లభించింది. ఎన్నో యేళ్లుగా డిచ్‌పల్లి-నిజామాబాద్ రోడ్డును విస్తరించాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే చివరకు తెలంగాణ ప్రభుత్వంలో వారి కల నెరవేరనుంది.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల రహదారులన్నింటిని వంద శాతం బాగు చేయాలని నిర్ణయించడంతో ప్రజలు ఆనందిస్తున్నారు. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ వరకు ఉన్న 15 కిలోమీటర్ల రెండు లైన్ల బీటీ రోడ్డు ప్రస్తుతం పలు చోట్ల గుంతలు తేలి ఉంది. ప్రతి నిత్యం ఈ రోడ్డుపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
గుంతల రోడ్డుతో ఏదో చోట వాహనదారులు ప్రమాదాలకు గురవుతునే ఉన్నారు. పలు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిన వాహనాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్డును ఫోర్‌లైన్ల రోడ్డుగా విస్తరించాలని మండల వాసులు ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
గత యేడాది కిత్రం నాగ్‌పూర్ గేటు నుంచి 2 కిలో మీటర్ల దూరం రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించి మధ్యలో మానివేశారు. శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ఈ రోడ్డును ఫోర్‌లేన్ రోడ్డుగా మార్చేందుకు రూ. 215 కోట్లు నిధులు మంజూరు చేయడంతో మండల ప్రజలు హర్షిస్తున్నారు.
రోడ్డు విస్తీర్ణంపై స్పష్టత లేదు
డిచ్‌పల్లి-నిజామాబాద్ రోడ్డును ఫోర్ లేన్ రోడ్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు విస్తరణ పను లు చేపడితే డిచ్‌పల్లి రైల్వేస్టేషన్, నడిపల్లి, ధర్మారం(బి), మాధవ నగర్ గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాస గృహాలు, పంట పొలాలు కోల్పోనున్నాయి.
ఫోర్‌లేన్ రోడ్డు విస్తీర్ణం వంద అడుగులా లేక నూటయాబై అడుగులు ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేక స్థాని కులు అందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలా లు ఉన్న చోట ఎక్కువ స్థలం తీసుకుని, ప్రజల నివాసపు ఇళ్లు ఉన్న చోట తక్కువ విస్తీర్ణంలో రోడ్డు పనులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.కాగా రోడ్డు విస్తీర్ణం విషయమై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.
మాధవనగర్ వద్ద ఓవర్‌బ్రిడ్జి
డిచ్‌పల్లి-నిజామాబాద్ ప్రధాన రహదారిపై మాధవనగర్ సాయిబాబా ఆలయం సమీపంలో రైల్వే గేటు ఉంది. ఇక్కడ రైల్వే గేటు వేసినప్పుడు పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోర్‌లైన్ రోడ్డు నిర్మిస్తే ఈ గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. దీంతో రైల్వే గేటుతో సంబంధం లేకుండా వాహనదారులు నేరుగా నిజామాబాద్ నగరానికి చేరుకుంటారు. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ వరకు 15 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డుపై ధర్మారం(బి) శివారులో రెండు చోట్ల, బోర్గాం (పి) వద్ద రెండు చోట్ల వంతెనలు నిర్మించే అవకాశాలున్నాయి.
మారనున్న రూపు రేఖలు..
డిచ్‌పల్లి-నిజామాబాద్ రహదారి ఫోర్‌లేన్ రోడ్డుగా మారితే మండల కేంద్రం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఫోర్‌లేన్ రోడ్డుపై మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే రాత్రి వేళ మండల కేంద్రంతో పాటు రహదారిపై ఉన్న గ్రామాలు విద్యుత్ వెలుగులతో జిగేలు మంటాయి.
ఎట్టకేలకు మోక్షం..
Published Sun, Nov 9 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement