సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద నీటి వినియోగంపై ఎవరి లెక్కలు వారివే అన్న చందంగా ఉన్నాయి. నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తున్నా, లెక్కల్లో మాత్రం తేడాలుంటున్నాయి. తాజా లెక్కల్లోనూ ఇలాంటి తేడాలే కనిపించాయి. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం 354.96 టీఎంసీల వినియోగాన్ని తెలంగాణ చూపితే, 357.06 టీఎంసీల వినియోగం జరిగిందని ఏపీ చెబు తోంది. ఈ రెంటికీ విరుద్ధంగా 354.51 టీఎంసీల వినియోగం జరిగిందని బోర్డు లెక్కేసింది.
పోతిరెడ్డిపాడు కింద తెలంగాణ, బోర్డు లెక్కలు దగ్గరగా ఉన్నా, ఏపీ చెప్పిన లెక్కలతో బోర్డు లెక్కలను సరిపోలిస్తే 1.73 టీఎంసీల మేర ఏపీ అధికంగా వినియోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు జూరాల పరిధిలో తెలంగాణ వినియోగం 25.81 టీఎంసీలుగా ఉండగా బోర్డు ఇదే విషయాన్ని చెబుతుండగా, ఏపీ మాత్రం 27.53 టీఎంసీల మేర వినియోగం జరిగినట్లుగా తెలిపింది. ఇక్కడ కూడా 1.72 టీఎంసీల మేర తేడా వస్తోంది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో బోర్డు, తెలంగాణ 8.33 టీఎంసీల మేర వినియోగాన్ని చూపగా, ఏపీ మాత్రం 2.96 టీఎంసీల తేడాతో 5.37 టీఎంసీల వినియోగాన్ని చూపింది. నీటి వినియోగంలోని తేడాలపై కృష్ణాబోర్డు శుక్రవారం ఇరు రాష్ట్రాల దృష్టికి తీసుకొచ్చింది. సాగర్ ఎడమ కాల్వ కింద సరఫరా, ఆవిరి నష్టాలు, మొత్తంగా కేటాయించిన నీటిలో 20 శాతం సరఫరా నష్టాల కింద చూడాలన్న అంశంపై వివిధ కమిటీలు తమ నివేదికలు సమర్పిస్తే తేడాలను సరిదిద్దుకోవచ్చని బోర్డు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment