ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకకు ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు.. కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చే వాహనాలు ఈ మధ్య రాష్ట్రంలో డీజిల్ కొట్టించుకోవడం లేదు.. కర్ణాటకలోనే ట్యాంకు ఫుల్ చేయించుకుంటున్నారు. కారణం.. అక్కడితో పోలిస్తే.. రాష్ట్రంలోని డీజిల్ ధరలు చుక్కలు చూపుతుండటమే. తెలంగాణలో లీటరు డీజిల్ ధర సెప్టెంబర్ 18న రూ.80.35ఉండగా కర్ణాటకలో రూ.74.25గా ఉంది. అంటే ఏకంగా రూ.6.10 వ్యత్యాసం ఉంది. దీంతో పొరుగు రాష్ట్రంలోనే ట్యాంకు ఫుల్ చేయిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రం డీజిల్ రూపంలో తనకు రావాల్సిన ఆదాయాన్ని కూడా నష్టపోతోంది.
సరిహద్దు జిల్లాల్లో..
ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే.. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు కర్ణాటకను ఆనుకుని ఉంటాయి. దీంతో ఈ జిల్లాల నుంచి కర్ణాటకకు పలు లారీలు, ప్రైవేటు బస్సులు తరచుగా రాకపోకలు సాగిస్తుంటాయి. డీజిల్ ధరల్లో రెండు రాష్ట్రాలకు భారీగా వ్యత్యాసం ఉండటంతో కర్ణాటకకు చెందిన వాహనాలు, ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్లే వాహనాలేవీ తెలంగాణలో డీజిల్ కొట్టించుకోవడం లేదు. కర్ణాటక సరిహద్దుల్లోనే డీజిల్ పోయించుకుంటున్నాయి.
బ్లాక్ మార్కెట్..
రోజురోజుకు డీజిల్ ధరలు పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రం ఇటీవల స్థానిక పన్నుల్లో కొంత మినహాయించుకుంది. దీంతో అక్కడ ధరలు కాస్త తగ్గుముఖం పట్టి ఇపుడు రూ.74కు చేరుకున్నాయి. ఇదే అదనుగా సరిహద్దు జిల్లాల్లో అక్రమంగా డీజిల్ విక్రయించేవారు అక్కడ రూ.74కుకొని ఇక్కడ రూ.78 విక్రయిస్తున్నట్లు సమాచారం. అసలు రేటుకంటే లీటరుకు రూ.2 తక్కువగా వస్తుండటంతో కొందరు కొనుగోలు చేస్తున్నారు.
ఇక కర్ణాటకకు.. ముఖ్యంగా బెంగళూరు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్, బస్సులు కూడా అక్కడే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాయి. ఇక బెంగళూరుకు వెళ్లే ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లు కర్ణాటకలో డీజిల్ పోయించుకుని, తెలంగాణలో తీసుకున్నట్లు బిల్లులు సృష్టిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లు కూడా భారీగా డీజిల్‌ను అక్రమంగా రాష్ట్రానికి తరలిస్తున్నారని సమాచారం. ఇలా బ్లాక్‌మార్కెట్ పెరుగుతూ పోతే.. తెలంగాణ డీజిల్ విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వెంటనే తగ్గించాలి..
ఈ ధరలను చూసి మాకు మతిపోతోంది. కేంద్రం మాట అటుంచితే, కనీసం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఎంతోకొంత తగ్గించాలి. లేకుంటే.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే లారీలన్నీ అక్కడే డీజిల్ పోయించుకుంటాయి. ఇలా జరిగితే.. రాష్ట్రం ఆదాయం కోల్పోతుంది. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఎంతో కొంత తగ్గిస్తే.. ఇటు మాకు, అటు ప్రభుత్వానికి ఉభయతారకంగా ఉంటుంది. లేదంటే మా రంగం సంక్షోభంలోకి వెళుతుంది.
– భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీల యాజమాన్యం అధ్యక్షుడు
––––––––––––––––––––
ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలి..
స్థానికంగా వివిధ రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుని రూ.2కు పైగా ధర తగ్గించాయి. ఈ విధంగా తెలంగాణ కూడా చొరవ తీసుకోవాలి. పైగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు ఇదే సరైన సమయం. వ్యాట్ విషయంలో ఆర్టీసీకి మినహాయింపు లేదా సబ్సిడీ ఇవ్వాలి. లేకపోతే ప్రజారవాణా వ్యవస్థ కుంటుపడుతుంది.
– నాగేశ్వరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్
Comments
Please login to add a commentAdd a comment