వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
మున్ననూరులో డిగ్రీ విద్యార్థి బలవన్మరణం
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో డిగ్రీ విద్యార్థి, వలస కూలీ, గుర్తుతెలియని వృద్ధుడు, యువకుడు ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వలస కూలీ..
గద్వాల : బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌కు చెందిన వెంకటన్న (45) మూడునెలల క్రితం భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం గద్వాల పట్టణానికి వచ్చాడు. అప్పటి నుంచి నదిఅగ్రహారం వెళ్లే దారిలో తోటలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా, ఈయన తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురై శనివారం ఉదయం తోట దగ్గర ఉన్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని టౌన్ ఎస్‌ఐ సైదాబాబు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం గద్వాల ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు.
గోపాల్‌పేట : మండలంలోని మున్ననూరుకు చెందిన లక్ష్మి, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు స్థానికంగా ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిలో చిన్నకొడుకు తిరుపతి (19) వనపర్తి పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా, రెండురోజుల క్రితం గ్రామంలోని ఓ కిరాణ షాపులో దొంగతానికి పాల్పడ్డాడంటూ అక్కడివారు మందలించారు.
అలాగే వారంరోజుల క్రితం మరో సంఘటనలో ఈ విద్యార్థిని దూషించారు. దీంతో మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం ఇంటి తలుపునకు కర్టెన్ వేసి ఊయలకొండికి ఉరేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం పని ముగించుకుని తిరిగొచ్చిన తల్లిదండ్రులు చూసి బోరుమన్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ శేఖర్‌యాదవ్ పరామర్శించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సైదులు తెలిపారు.
కడుపునొప్పి భరించలేక..
కోస్గి : ఇంకో సంఘటనలో కోస్గి మండలం ముశ్రీఫాకు చెందిన నర్సిములు (35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం శివారులోని పొలానికి వెళ్లి పురుగుమందు తాగాడు. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న కొందరు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికి అతను మృతి చెంది ఉన్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్‌ఐ వెంకటయ్య కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
కోయిల్‌కొండ : ఓ వృద్ధుడికి ఏ కష్టం వచ్చిందోగాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం కోయిల్‌కొండ మండలంలోని మల్కాపూర్ శివారులో ఓ గుర్తుతెలి యని వ్యక్తి (60) చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం అ టువైపు వెళ్లిన బాటసారులు గమనించి వెంటనే పోలీసులతోపాటు వీఆర్‌ఓ లక్ష్మీకాంత్‌రెడ్డికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ మురళి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఒంటిపై తెల్ల చొక్కా, బేబులో రూ.330లతోపాటు మద్దూరు నుంచి మల్కాపూర్‌కు తీసుకున్న ఆర్టీసీ బస్ టికెట్టు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.