అధికారం రావడం కాదు.. నిలబెట్టుకోవడమే కష్టం
విఠల్‌రెడ్డి, విద్యాసాగర్ చేరిక కార్యక్రమంలో కేసీఆర్ వ్యాఖ్య
వారంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి
హైదరాబాద్: ‘‘అధికారం రావడం కాదు.. దానిని నిలబెట్టుకోవడమే కష్టం. తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు, మన పొలాలకు నీళ్లు అందించడం గొప్ప’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కరెంటు కొరతపై ఇప్పుడేమీ చేయలేను. కొందామంటే దుకాణంలో దొరికే వస్తువు కాదు. ఎంత ఉరికి ఉరికి పనిచేసినా రెండు మూడేళ్ల వరకు ఏమీ చేయలేను. మూడేళ్ల తర్వాతే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తా. అప్పటిదాకా ఇబ్బందులు తప్ప వు. మనకు బాధ అయినా ఏమీ చేయలేం. నేనూ రైతునే, నాకూ పొలం ఉంది. అది కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉంది’’ అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి లైన్ వేయడానికి మూడేళ్లు పడుతుందని, ఆ తర్వాతే రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని వివరించారు. చుట్టూ అడవి, నక్సల్స్ సమస్య ఉందని చెప్పారు.
ఆంధ్రా ప్రభుత్వం కరెంటు ఉత్పత్తిని ఆపేసి ఇబ్బంది పెడుతోందని, మనకూ సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించా రు. వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఊరికీ పరిశుభ్రమైన మంచినీటిని అందిస్తామని స్పష్టంచేశారు. ‘‘రుణం ఎలా మాఫీ చేస్తారంత టూ, అప్పులు ఎలా కడతారంటూ ఆర్‌బీఐ చిన్నచిన్న ఇబ్బందు లు పెడుతోంది. అయినా రుణమాఫీని వంద శాతం చేస్తాం. దీనిపై ఆర్‌బీఐకి లేఖ కూడా రాశాం. అది కూడా అంగీకరించినట్టే. వారం రోజుల్లో ఆర్థిక, వ్యవసాయ రుణమాఫీ ప్రక్రియ ను ప్రారంభిస్తాయి’’ అని సీఎం వెల్లడించారు. కేబినెట్ మంత్రి పదవితో సమానమైన పదవిని ఇంద్రకరణ్‌రెడ్డికి ఇస్తామని తెలిపారు.
ఏడాదిలో 24 గంటల కరెంటు: నాయిని
ఏడాదిలోగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వనపర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు బుధవారమిక్కడి తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి నాయిని మాట్లాడుతూ.. ప్రస్తుత కరెంటు కొరతకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య అవినీతిని బయటపెడ్తామని హెచ్చరించారు.
కేసీఆర్ ‘స్థానిక’ పాఠాలు!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తనున్నారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ఏలికలకు స్వయంగా శిక్షణ ఇవ్వనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రజాప్రతినిధులకు ఈ నెల మూడో వారంలో మూడు రోజులపాటు వేర్వేరుగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తొలిరోజు సీఎం కేసీఆర్ క్లాసులే ఉంటాయని, బంగారు తెలంగాణ నిర్మాణానికి తానేం కోరుకుంటున్నాను.. ఏం చేయదలచుకున్నాను.. వారి నుంచి ఏం ఆశి స్తున్నాను.. అన్న అంశాలను వివరించాలని సీఎం భావిస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.