
తాగునీటి సమస్యలపై పోరు
⇒ క్షేత్రస్థాయి నుంచి పోరాడతాం: దిగ్విజయ్
⇒ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి నుంచి పోరాడుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం ఉత్తమ్, ఇతర ముఖ్య నేతలతో కలసి దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, సమస్యలను పరిష్కరించడంలో విఫలమైం దన్నారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీని దారి మళ్లిం చిందని ఆరోపించారు.
సాగునీటి ప్రాజెక్టు లను పూర్తి చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కాం గ్రెస్‌పై నిందలు వేయడం సరికాదన్నారు. ‘‘ప్రాజెక్టుల కు మాపార్టీ వ్యతిరేకం కాదు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రజెంటేషన్‌లోని ప్రశ్నలకు సీఎం ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ప్రాజెక్టుల అంచనాలను అడ్డగోలుగా పెంచుతున్నారు. భూసేకరణపై రోజుకో జీవో ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారు. భూసేకరణ చట్టం–2013తోనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో అధికారం అంతా కేసీఆర్, ఆయ న అల్లుడు, కొడుకు, కూతురు చుట్టూనే కేంద్రీకృతమైంది’’ అన్నారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు.
9న సీఎల్పీ భేటీ...
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజాక్షేత్రంలో కార్యాచరణపై చర్చించడానికి కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ నెల 9న సమావేశం కానుంది. దీనికి దిగ్విజయ్ కూడా హాజరుకానున్నారు. గిరిజనులకు చెందిన అటవీ భూముల స్వాధీనంపై ఈ నెల 10న టీపీసీసీ చర్చించనుంది.
మదర్సాలపై ఆరెస్సెస్ దుష్ప్రచారం
మదర్సాలపై ఆరెస్సెస్, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీలు దుష్ప్రచారం చేస్తున్నాయని దిగ్విజయ్ విమర్శించారు. మదర్సాల్లో చదువుకున్న ఒక్క విద్యార్థి కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న దాఖలాలు లేవన్నారు. ముస్లింలపై జాతీయ మీడియాలోని కొన్ని వర్గాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిందూ తీవ్రవాదం గురించి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీలు ఫాసిస్టు విధానాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.
జాత్యహంకార దాడుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబానికి దిగ్విజయ్‌సింగ్ సంతాపం ప్రకటించారు. సమన్వయ కమిటీ సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, మధుయాష్కీ, బలరాం నాయక్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
పాల్వాయి.. కోమటిరెడ్డి వాగ్వాదం
సమన్వయ కమిటీ భేటీలలో రాజ్య సభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఉత్తమ్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేలా వ్యవహరిం చాల ని పాల్వాయి సూచించారు. అందుకు కోమటిరెడ్డి స్పందిస్తూ.. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించా రో, తనను భువనగిరి ఎంపీగా ఓడించ డానికి ఎవరు పనిచేశారో గుర్తుంచుకోవా లన్నారు. దీంతో దిగ్విజయ్ జోక్యం చేసు కుని పార్టీ అంతర్గత అంశాలపై బహి రంగంగా ఎవరు మాట్లాడినా మంచిది కాదని, తొందరపాటు వ్యాఖ్యల వల్ల నష్టం కలుగుతుందని హెచ్చరించారు.