వ్యవసాయ పరిశోధనలను మరింత సమర్థవంతంగా రైతులకు అందించే లక్ష్యంతో వ్యవసాయ జర్నలిజంపై జాతీయ స్థాయి డిప్లొమా కోర్సును ప్రారంభించడానికి జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) సమాయత్తమవుతోంది. ఈ కోర్సు రూపురేఖలు, శిక్షణాంశాలపై చర్చించేందుకు సంబంధిత నిపుణులు, సీనియర్ జర్నలిస్టులు, శాస్త్రవేత్తలతో శుక్రవారం మేనేజ్ డెరైక్టర్ జనరల్ ఉషారాణి తమ కార్యాలయ ఆవరణలో చర్చాగోష్టిని నిర్వహించారు.
దేశవ్యాప్తంగా వ్యవసాయ పరిశోధనా సంస్థలు 140 ఉన్నాయని, ఏటేటా ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న పరిశోధనల ఫలాలను రైతులకు అందించడంలో విఫలమవుతున్నామని ఉషారాణి అన్నారు. విస్తరణ సేవల్లో జర్నలిజం పాత్ర చాలా కీలకమన్నారు. క్షేత్రస్థాయి జర్నలిస్టులు, అధికారులు, శాస్త్రవేత్తల కోసం అగ్ని జర్నలిజంపై డిప్లొమా కోర్సును ప్రారంభించనున్నామన్నారు. వ్యవసాయ విస్తరణలో లోపాలను గుర్తించి, సాంకేతికతను రైతుల గుమ్మంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వినోద్ పావురాల, రచన జర్నలిజం కాలేజి ప్రిన్సిపాల్ రేవూరి ఉమామహేశ్వరరావు, సాక్షి న్యూస్‌ఎడిటర్, సాగుబడి ఇన్‌చార్జ్ పంతంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.