సదా.. నిరాశ | Disappointed the railway minister as a railway budget | Sakshi
Sakshi News home page

సదా.. నిరాశ

Published Wed, Jul 9 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

సదా.. నిరాశ

సదా.. నిరాశ

రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి
- ఒక్క ప్రాజెక్ట్‌నూ ప్రస్తావించని రైల్వే మంత్రి
- కమిటీ నివేదిక వచ్చాకే నిర్ణయమని దాటవేత
- ఊసే లేని కాజీపేట డివిజన్ హోదా
- వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ, కోల్ కారిడార్‌దీ అదే దారి
- కంటితుడుపుగా రెండు హైస్పీడ్..
- మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
 సాక్షి, హన్మకొండ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్... జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేపరంగా హైదరాబాద్ తర్వాత కీలకమైన కాజీపేటపై దృష్టిసారించాలని, అభివృద్ధి పనుల మంజూ రుతోపాటు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని కోరినా ఫలితం లేకుం డాపోరుంది.

ఐదేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ప్రతిపాదించిన కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదు. మూడేళ్ల కిందటి కాజీపేట-విజయవాడ మూడో రైల్వే లేన్ నిర్మాణం సంగతి ఎటూ తేల్చకుండానే సికింద్రాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు అని కొత్త పాటందుకున్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్ట్‌లు, అభివృద్ధి పనులపై  ఓ కమిటీని నియమించాం.. నివేదిక వచ్చాక వాటిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రైల్వే శాఖ మంత్రి దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తెలంగాణకు... అందులోనూ వరంగల్ జిల్లా ప్రాజెక్ట్‌ల ప్రస్తావన లేకుండానే మమ అనిపించారు.
 
‘వ్యాగన్'కు మొండిచేయి
‘గతంలో మంజూరై... నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ల జాబితానే పెద్దగా ఉంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం.’ అని బడ్జెట్‌కు రెండు రోజుల ముంగిట రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సెలవిచ్చారు. ఈ మేరకు ఐదేళ్ల కిత్రం పీపీపీ పద్ధతిలో మంజూరైన వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. కానీ... రైల్వే బడ్జెట్‌లో దీనిపై ఊసే ఎత్తలేదు.

అదేవిధంగా....  ఉత్తర, దక్షిణ, పశ్చిమ భారతదేశాలను కలిపే కీలక జంక్షన్ కాజీపేట మీదుగా న్యూఢిల్లీ-చైన్నై, హైదరాబాద్-చెన్నై మార్గంలో అధిక సంఖ్యలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో కొత్త రైళ్లు నడిపేందుకు స్లాట్ దొరకడం కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితమే కాజీపేట-విజయవాడ, బల్లార్షా-కాజీపేట మధ్య మూడో లేను నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సైతం ప్రత్యేక కమిటీకే అప్పగించి చేతులు దులుపుకున్నారు.  
 
కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట డివిజన్‌దీ అదే దారి
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా కాజీపేటను ఎంపిక చేసి, కేంద్రానికి తెలిపింది. అంతేకాదు... రైల్వేపరంగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని కోరింది.

ఈ అంశాలన్నింటీని సదానందగౌడ తన బడ్జెట్‌లో పక్కన పెట్టారు. అదే సమయంలో తన సొంత రాష్ట్రమైన కర్నాటకలోని బెంగళూరు సమీపంలో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే చెన్నైలో కోచ్ ఫ్యాక్టరీ ఉండగా... రెండేళ్ల క్రితం  కేరళలోని పాలక్కాడ్‌కు మంజూరైన  నూతన కోచ్ ఫ్యాకరీ నిర్మాణ దశలో ఉంది. పెద్దసంఖ్యలో ఉపాధి కల్పించేటువంటి భారీ పరిశ్రమలైన రైల్ కోచ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే మూడు ఉండగా... మరోసారి దక్షిణ భారతదేశానికి మంజూరు కావడం కష్టమేనన్న  సందేహాలు జిల్లావాసుల్లో వ్యక్తమవుతున్నాయి.
 
కారు చీకట్లో కోల్ కారిడార్
భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేసేలా బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలకు  రైల్వే కనెక్టివిటీ పెంచేలా క్రిటికల్ కోల్‌కారిడార్  బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైల్వే లేన్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి మణుగూరు-రామగుండం ప్రాజెక్ట్‌కు మొండిచేయి చూపించారు.

దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి కేవలం తెలంగాణలోనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలుమార్లు సర్వేలు పూర్తి కాగా... మణుగూరు-రామగుండం కోల్‌కారిడార్‌కు నిధులు మంజూరు చేస్తారని అందరూ ఆశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోటాతో ముడిపెట్టి ఈ ప్రాజెక్ట్‌ను నట్టేట ముంచారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం నిడివి 200 కిలోమీటర్లు ఉంటే, ఇందులో 130 కి.మీ నిడివి వరంగల్ జిల్లాలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్ మంజూరైతే ఏజెన్సీలో అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టేది.
 
కంటితుడుపుగా రెండు హైస్పీడ్ రైళ్లు
కాజీపేట మీదుగా సికింద్రాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్ -చెన్నై మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించారు. కంటితుడుపు చర్యగా వీటిని ప్రవేశపెట్టింది. దేశంలో ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీ-ఆగ్రా మధ్య హైస్పీడ్ రైలును ఈ నెల మొదటి వారంలో నడిపించారు.

ఈ హైస్పీడ్ రైళ్ల వల్ల ఇప్పటికిప్పుడు ఒనగూరే ప్రయోజనం లేదు. ప్రకటించిన రెండు మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు గల అవకాశాలను పరిశీలించడం.. అవసరమైన మార్పులు చేసిన తర్వాతే ఈ మార్గంలో కొత్తవి పరుగెడతాయి. ఇందుకు ఏడాది సమయం పట్టొచ్చు.

మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే...
మొక్కుబడిగా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు జిల్లా మీదుగా ప్రయాణించడం ఒక్కటే  ఈ బడ్జెట్‌లో జిల్లాకు చేకూరిన ప్రయోజనం. సికింద్రాబాద్-హజ్రత్‌నిజాముద్దీన్ జనసాధరణ్, విజయవాడ-న్యూఢిల్లీ ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణం సాగిస్తాయి.

వీటిలో విజయవాడ-న్యూఢిల్లీ ప్రీమియం రైలు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు దీని వల్ల ఉపయోగం తక్కువ. సికింద్రాబాద్-నిజాముద్దీన్ జనసాధరణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్రీక్వెన్సీ వస్తే తప్ప... ఎంత ఉపయోగమనేది తేలదు. కాగా, షోలాపూర్-చెన్నై మధ్య మరో రైలును ప్రకటించినా... ఇది కాజీపేట మీదుగా వెళ్లేది, లేనిది అనే అంశంపై స్పష్టత లేదు.

కాగా, నిత్యం రద్దీగా ఉండే కాజీపేట- బల్లార్షా మార్గంలో మరో రైలు రానుంది.  కాజీపేట నుంచి ముంబరుుకి నేరుగా రైళ్లు నడపాలని ఎన్నాళ్ల నుంచో ఉన్న డిమాండ్‌ను ఈ బడ్జెట్‌లో రైల్వేశాఖ ఆమోదించింది. కాజీపేట నుంచి బల్లార్ష మీదుగా ముంబరుుకి వీక్లీ రైలును ప్రకటించారు. మొత్తంగా కాజీపేట మీదుగా మూడు రైళ్లు నడుస్తుండగా... ఈ రైలు వల్లనే జిల్లా వాసులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇదే జరిగితే వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
 
ఎంపీలు ప్రయత్నిస్తే.. రైల్వే యూనివర్సిటీ
ఈ సారి రైల్వే బడ్జెట్‌లో సదానందగౌడ ప్రకటించిన ఆసక్తికర అంశాల్లో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు స్థాపన ముఖ్యమైనది.  ప్రస్తుతం ఉన్న టెక్నికల్, రెగ్యులర్ యూనివర్సిటీల సహాయ సహకారాలతో సాధారణ, సాంకేతిక అంశాల్లో పట్టు సాధించేలా రైల్వే యూనివర్సిటీని నెలకొల్పుతామని పేర్కొన్నారు. అరుతే... ఈ వర్సిటీని ఎక్కడ నెలకొల్పుతారనే అంశాన్ని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. ప్రతిష్టాత్మాక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)తోపాటు కాకతీయ వర్సిటీ వరంగల్‌లో ఉన్నందున ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కాజీపేట అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధ్యాసాధ్యాలను బట్టి ఈ వర్సిటీని కాజీపేటలో ఏర్పాటు చేసే దిశగా... జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎంపీలు ఇప్పటి నుంచే కృషి చేయాల్సిన అవసరం ఉంది.
 
మహిళలకు ప్రత్యేక కోచ్‌లు
మహిళలకు ప్రత్యేక కోచ్‌లు ప్రవేశపెడుతున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్ ద్వా రా భోజనం అందించనున్నట్లు, రైళ్లలో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైళ్ల లో, రైల్వే స్టేషన్లలో ఆహారం బాగా లేకపోతే వెండర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, రైల్వే ఆస్తుల పరిరక్షణ విషయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులకు సెల్‌ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
 
రైల్వే బడ్జెట్ నిరాశపరిచింది...
 రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి, జిల్లాకు ప్రత్యేక ప్రతిపాదనలు ఏమీ లేవు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేసినట్లు ప్రకటించడానికే  పరిమితమయ్యారు. ఇందులో ఏముంటుందో వారికే తెలియాలి. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా ఉంది.  జిల్లాకు సంబంధించిన కాజీపేట కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీలు, డివిజన్ గురించి ఏం తేలలేదు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ప్రిమియర్ రైలు వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణను పక్కనపెట్టినట్లున్నది. మోడీ తరహా బడ్జెట్ అంటున్నప్పటికీ... మనకు వచ్చిందేమీలేదు. రానున్న రోజుల్లో కేంద్రం... తెలంగాణతో ఇదే తీరుగా వ్యవహరిస్తుందా... అనే అనుమానం కలుగుతోంది.
 - సీతారాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ
 
ప్రస్తావనకు రాని అంశాలు
కాజీపేట రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్, రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్‌లో సెంట్రల్ సిలబస్ ప్రవేశ పెట్టడం, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్‌లలో అప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్,  పిరియాడికల్ ఓవరాలింగ్ షెడ్ (పీఓహెచ్) ఏర్పాటు అంశాలు రైల్వే బడ్జెట్‌లో ప్రస్తావనకే రాలేదు.

కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్ -గౌహతి వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కాకినాడ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కాజీపేటలో హాల్టింగ్ కల్పిస్తారని ఆశించిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజులు పొడిగిస్తారని అనుకున్నప్పటికీ ఆశాభంగమే మిగిలింది.     - కాజీపేట రూరల్
 
కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రాజెక్ట్
రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రైల్వే కార్మికులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) విధానానికి పెద్దపీట వేశారు. చైనా దేశంలో అనుసరిస్తున్న రైల్వే విధానాన్ని  భారత్ రైల్వేలో ప్రవేశపెడతామని, అభివృద్ధి చేస్తామన్న రైల్వే మంత్రి మాటలు సాధ్యమయ్యేవి కావు.  కాజీపేట డివిజన్, వ్యాగన్‌షెడ్ ప్రస్తావనకు రాకపోవడం శోచనీయం. ఈ రైల్వే బడ్జెట్‌లో కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు.
  - కె.శ్రీనివాస్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్
 యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్
 
తెలంగాణ ప్రాజెక్ట్‌లపై స్పష్టత లేదు
రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ ప్రాజెక్ట్‌లపై స్పష్టత లేదు. 2010-11 బడ్జెట్‌లో రైల్వే కార్మికులకు సొంత ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి ప్రకటించారు. ఈ రైల్వే బడ్జెట్‌లోనైనా కార్మికుల సొంతింటి కల నెరవేరుతుందని అనుకున్నారు. కార్మికుల ఆశలు అడియాసలే అయ్యూరుు. కార్మికుల పిల్లలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు.
 - దేవులపెల్లి రాఘవేందర్,
 కాజీపేట రైల్వే జేఏసీ కన్వీనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement