సిద్దిపేట ‘కేతువు’.. ఉంటడా.. పోతడా? | Discussion on the still under way One Town CI transfer | Sakshi
Sakshi News home page

సిద్దిపేట ‘కేతువు’.. ఉంటడా.. పోతడా?

Published Thu, Oct 23 2014 10:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

సిద్దిపేట ‘కేతువు’.. ఉంటడా.. పోతడా?

సిద్దిపేట ‘కేతువు’.. ఉంటడా.. పోతడా?

* వన్‌టౌన్ సీఐ బదిలీపై జోరుగా చర్చ
* మాస్టర్‌మైండ్స్ వ్యవహారంలో ‘చేతివాటం’పై రచ్చ
* బాధితులపై కేసులు పెట్టిండని పెల్లుబికిన ప్రజాగ్రహం
* నిరసనలు మిన్నంటడంతో డీఎస్పీ వివరణ

సిద్దిపేటల యాడ జూశినా ఒకటే ముచ్చట.. నలుగురు గలిస్తె సాలు.. ‘గింత రచ్చ జరిగినాగూడ సీఐ సురేందర్‌రెడ్డి ఇంకా ఈడనే ఉంటడా..? ఏమోరా బై.. ఆయనకు పాలకులు, ప్రతిపక్షాల అండ దండిగుందట.. మరి ఉంటడో.. పోతడో సూడాలె..! ఏంరో.. సురేందర్‌రెడ్డి అంటె ఏమనుకుంటన్నవ్.. నీకు ఆయన గురించి తెల్వద్.. పెద్దోళ్ల సపోట్ లేకుంటె సిద్దిపేట రూరల్ ఎస్‌ఐ, వన్ టౌన్ ఎస్‌ఐ, రూరల్ సీఐ, ట్రాఫిక్ సీఐ, వన్ టౌన్ సీఐగా.. ఎనమ్దేండ్ల నుంచి ఈడనే ఉండెటోడా ఆలోశించు..? పోలీస్ డిపాట్‌మెంట్‌ల గిన్నొద్దుల సంది ఒక్క దగ్గర పనిజేయనిత్తార్రా..? నువ్వొద్దెనేరా.. గందుకే ఆయిన సీన్మల గబ్బర్‌సింగ్ లెక్క జేస్తుండు.. బడి పోరగాండ్ల మీద కేసులువెట్టె.. అమాయకుల మీద లాఠీలు ఇరగ్గొట్టె.. గిదేందని అడిగితె బెదిరియ్యవట్టె.. తన్నవట్టె.. మరి మన పెద్దోళ్లకు ఇవి కనవడ్తలేవా..? ఇదీ.. పట్టణంలో ఇప్పుడు హాట్ టాపిక్.                             
- సిద్దిపేట అర్బన్   



ఏళ్ల తరబడి సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్న వన్‌టౌన్ సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డికి బదిలీ తప్పదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పట్టణంలోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో ఈ నెల 16న జరిగిన సంఘటనలో ఈయన వ్యవహార శైలి పోలీస్ బాస్‌లకు కూడా తంటాలు తెచ్చిపెట్టిందని అధికారులే చెప్పడం గమనార్హం. సీఐపై వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం వీరిలో అసహనాన్ని పెంచిందని తెలుస్తోంది. దీంతో సదరు సీఐని బదిలీ చేస్తేనే బాగుంటుందని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ సీఐ తన ‘పలుకు’బడి, పరపతిని వాడుతూ ఏళ్ల తరబడి సిద్దిపేటను వీడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు వెళ్లిన ఈయన ఎలక్షన్లు ముగియగానే సంగారెడ్డిలో రిపోర్ట్ చేసి మళ్లీ వన్ టౌన్ సీఐగా విధుల్లో చేరాడు. దీంతో ‘సిద్దిపేటలో నేను మాట్లాడిందే వేదం.. నేను జెప్పిందే న్యాయం.. అనేలా వ్యవహరిస్తూ.. ఇటీవల మాస్టర్‌మైండ్స్ కళాశాలలో జరిగిన గొడవలో తన ‘చేతివాటం’ చూపిన ఆయన.. న్యాయం చేయాలంటూ వెళ్లిన బాధితురాలి భర్తతో పాటు విద్యార్థులపై ఐపీసీ 307 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించాడ’ని ప్రజా, విద్యార్థి, దళిత సంఘాలు మండిపడ్డాయి. దీనిపై రోడ్లెక్కి నిరసనలు చేపట్టాయి. సీఐ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఆందోళనలు తీవ్రం కావడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నెల 19న డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సిద్దిపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘సీఐపై విచారణ కొనసాగుతోంది, ఈ కేసును నేనే పరిశీలిస్తున్నా’నని చెప్పడంతో ఆయా సంఘాలు శాంతించాయి.
 
కేసులలో మార్పులు...

కళాశాలలో సంస్కృతం బోధించే లెక్చరర్ పట్ల సదరు కాలేజీ డెరైక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనపై ఇరువర్గాల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి అండగా పట్టణంలో వివిధ రాజకీయ, ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. దీంతో 509 కేసుతో పాటు మరో సెక్షన్ 354(డి)ని కూడా చేర్చారు. కాలేజీలో గొడవపడిన బాధితురాలి భర్తతో పాటు పది మంది ఏబీవీపీ నాయకులపై నమోదైన కేసులో సెక్షన్ 307ను తొలగించి దాని స్థానంలో సెక్షన్ 324 చేర్చారు. ఈ మేరకు గతంలో నమోదైన కేసులపై చర్లపల్లి జైలులో ఉన్న బాధితురాలి భర్త, విద్యార్థులు బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement