భూమి లేని నిరుపేద దళితులకు భూ పంపిణీకి వారం రోజులు మాత్రమే గడువుంది. పంద్రాగస్టు రోజున లబ్ధిదారులకు పట్టాలు అందజేయాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు దానిపై చేస్తున్న కసరత్తు కొలిక్కి రాలేదు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో సమస్య మొదలైంది. భూమిని కొనేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు భూ పంపిణీ అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. తొలుత 53 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని భావించారు. లబ్ధిదారుల ఎంపిక, భూ సర్వే వంటి అంశాలు తక్కువ వ్యవధిలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో గ్రామాల జాబితాను కుదించారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో గ్రామం చొప్పున జిల్లాలో మొత్తం 14 గ్రామాలను గుర్తించారు. వ్యవసాయంపై ఆధారపడి గుంట భూమి కూడా లేని దళితులను మాత్రమే తొలి విడతలో లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. 14 గ్రామాల్లో 278 మంది లబ్ధిదారులకు 592.79 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా మూడెకరాలకు పట్టా ఇవ్వనున్నారు. అయితే ఎంపిక చేసిన గ్రామాల్లో పంపిణీకి అవసరమైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో పట్టా భూములను సేకరించాలని నిర్ణయించారు. భూ యజమానులు ప్రభుత్వానికి అమ్మకానికి సిద్ధమవుతున్నా ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎకరాకు సగటున రూ.5లక్షలకు పైనే ధర చెబుతున్నట్లు సమాచారం. అధికారులు మాత్రం పెద్ద మొత్తంలో ధర చెల్లించే పరిస్థితి తమ పరిధిలో లేదంటున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో జరుగుతున్న లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయించాలని భావిస్తున్నారు.
యజమానులతో జేసీ భేటీ
భూమి కొనుగోలుకు సంబంధించి సగటున ఎకరాకు రూ.2లక్షల నుంచి 3లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామాల వారీగా భూముల అమ్మకానికి ఆసక్తి చూపుతున్న వారితో జాయింట్ కలెక్టర్ శర్మన్ స్వయంగా సమావేశమై మాట్లాడుతున్నారు.
ఒకటి రెండు రోజుల్లో ధర నిర్ణయించడంతో పాటు, కొనుగోలుకు ఎంత మొత్తంలో బడ్జెట్ అవసరమవుతుందనే అంశంపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. వీలైనంత త్వరలో భూ సేకరణ కసరత్తు పూర్తి చేసి పంద్రాగస్టు రోజున లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జేసీ శర్మన్ ‘సాక్షి’కి వెల్లడించారు.
పంద్రాగస్టుకు పట్టాలొచ్చేనా..?
Published Fri, Aug 8 2014 4:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement