ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీపై జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీపై జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. రూ.లక్షలోపు రుణం మాఫీ చేస్తామని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కారు.. తాజాగా రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం.. మార్గదర్శకాల ఆధారంగా జిల్లాలో ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హత కలిగి ఉన్నారో తేల్చే పనిలోపడింది.
బ్యాంకుల వారీగా లెక్కలు..
రైతు రుణాలకు సంబంధించి బ్యాంకుల వారీగా లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు చర్యలు వేగిరం చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా రూపొందించిన జాబితాలో 2.48 లక్షల మంది రైతులకు రూ. 1,223.98 కోట్లు మాఫీ చేయాల్సిందిగా గుర్తించారు. అయితే సర్కారు తాజా నిబంధనల్లో ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నారు.
దీంతో ఈ నిబంధనల ప్రకారం ఎంతమంది అర్హులు కానున్నారనే అంశంపై బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు. ముందుగా బ్యాంకు శాఖల వారీగా, ఆ తర్వాత మండల స్థాయిలో బ్యాంకుల వారీగా, ఆ తర్వాత జిల్లా స్థాయిలో బ్యాంకుల వారీగా వివరాలు పరిశీలించి వడపోత చేపట్టనున్నారు. మండల స్థాయిలో ఉమ్మడి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి లబ్ధిదారులను గుర్తిస్తారు. చివరకు జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించి లబ్ధిదారుల సంఖ్యను నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు మూడువారాల సమయం పడుతుందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.