సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని టీఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతల ఆధిపత్యానికి నిర్మల్ వేదికవుతోంది. సీనియర్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభారాణి భర్త సత్యనారాయణగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగిన కె.శ్రీహరిరావు ఇప్పుడు ఎవరికి వారే తమ ప్రాబ ల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాల్లో నిమగ్నం కావడంతో నిర్మల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
రాజకీయ జిల్లా కేంద్రంగా పేరొందిన నిర్మల్‌లో అధికార పార్టీలో నాలుగు స్తంభాలాట కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌లోని పలువురు ముఖ్యనేతలు ఈ నియోజకవర్గానికే చెం దినవారు కావడం, ఇతర నియోజకవర్గాల నేతలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంపైనే దృష్టి సారించడంతో ఆ పా ర్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ నే త వైపు మొగ్గుచూపితే రానున్న రోజుల్లో భవిష్యత్తుఎలా ఉం టుందోనని నాయకులు అయోమయానికి గురవుతున్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గతంలో కె.శ్రీహరిరావు కొనసాగారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడం.. బీఎస్పీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ యం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి కీలకంగా మారడం జరిగిపోయింది. సీనియర్ నేతగా పేరున్న ఇంద్రకరణ్‌రెడ్డికి ఇక్కడ గట్టి అనుచరవర్గం ఉంది. అలాగే చాలా ఏళ్ల నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాల్లో శ్రీహరిరావు నిమగ్నమయ్యారు.
దీంతో ఇక్కడ పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలు షురువయ్యాయి. పక్షం రోజుల క్రితం ఈ రెండు వర్గాలకు చెందిన ఒకరిద్దరు కార్యకర్తలు ఈజ్‌గాంలో బహిరంగంగానే గొడవకు దిగినట్లు సమాచారం. కాగా ఆ పార్టీ మరో అగ్రనేత వేణుగోపాలచారి కూడా ఈ మధ్య కాలంలో నిర్మల్‌పైనే దృష్టి సారించారు. ముథోల్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. విఠల్‌రెడ్డి ఆ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. దీంతో చారి ప్రస్తుతం నిర్మల్‌పై దృష్టి సారించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎమ్మెల్యేగా ఓటమి పాలైనప్పటికీ.. అధినేత కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని సాధించుకున్న చారి ఇప్పుడు తరచూ నిర్మల్‌లో పర్యటిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చ కు దారితీస్తోంది. గతంలో ఆయన టీడీపీలో పనిచేసినప్పు డు ఉన్న అనుచరులతో కలిసి తన క్యాడర్‌ను పెంచుకునే దిశ గా దృష్టి సారించారు. ఈ ముగ్గురికి తోడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభారాణి భర్త సత్యనారాయణగౌడ్ ప్రాబల్యం కూ డా ఈ మధ్య కాలంలో నిర్మల్‌లో చాలా వరకు పెరిగింది.
ఈ ముగ్గురు నేతలకు దీటుగా సత్యనారాయణగౌడ్ అనుచరవర్గం బలోపేతం అవుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో అధికార పార్టీలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ముఖ్యనేతల్లో షురువైన ఆధిపత్య పోరు.. ఇంకా రచ్చకెక్కకపోయినా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు ఊపందుకున్నాక పరిస్థితి ఎలా ఉంటుందోననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
నాలుగు స్తంభాలాట..!
Published Wed, Nov 19 2014 3:13 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement