ప్రశ్నల వర్షం | District Public Parishad General Meeting | Sakshi
Sakshi News home page

ప్రశ్నల వర్షం

Published Thu, Feb 12 2015 4:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

District Public Parishad General Meeting

ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలైనా మండల స్థాయిలో చేపడుతున్న వివిధ పథకాల ప్రగతి నివేదికలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు తెలుపకపోవడంపై మండిపడ్డారు. మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు ఆ స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది.

జెడ్పీ చైర్ పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖాశ్యాంనాయక్,విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కలెక్టర్ ఎం.జగన్‌మోహన్, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నా రు. సభలో చర్చించాల్సిన 45అంశాలకు గాను నాలుగు అంశాలు మాత్రమే చర్చించారు. ము ఖ్యంగా వ్యవసాయ, విద్యుత్, గ్రామీణ నీటి స రఫరా, డ్వామా శాఖలపై లోతుగా చర్చించిన వైద్య ఆరోగ్య, విద్యా శాఖ, సర్వశిక్షా అభియా న్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిపింది.

సమీక్షలో భాగంగా మంత్రి రామన్న మాట్లాడుతూ.. సర్వసభ్య సమావేశానికి సంబంధించి ప్రగతి నివేదికలు ఎంపీడీవోలకు అందజేయకపోవడంపై ఎంపీడీవోల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందోనని ఫైర్ అయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని జెడ్పీ సీఈవోకు సూచించారు. జిల్లా అధికారుల వద్ద ఇప్పటివరకు ఎంపీపీ, జెడ్పీటీసీల ఫోన్ నంబర్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మండల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని, అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని పేర్కొన్నారు.
 
వ్యవసాయ శాఖ
మిషన్ కాకతీయలో భాగంగా వ్యవసాయ శాఖ కు కూడా బాధ్యతలు ఉన్నాయని, గ్రామాల్లో దీనిపై అవగాహన కల్పించి చెరువుల్లో నుంచి తీస్తున్న మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల కలిగే లాభాలను వివరించాలని ఆదేశాలు ఉన్నట్లు ఆ శాఖాధికారి రమేష్ పేర్కొన్నారు. ఇన్‌చార్జి ఏవో ఉండడంతో రైతులకు ఇబ్బందు లు తలెత్తుతున్నాయని, రెగ్యులర్ ఏవోని నియమించాలని కోటపల్లి జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలంలో 1500 ఎకరాల్లో ఈ యేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోగా, ఆ రైతులకు పరిహారం ఇప్పించాలని జెడ్పీటీసీ ఏమాజీ కోరారు. ఆన్‌లైన్‌లో భూమి రికార్డులు ఉన్నా కొన్నిచోట్ల పహనీలు ఇవ్వడం లేదని తెలిపారు.
 
ఆత్మపై అసంతృప్తి..
వ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే వ్యవసాయ సాంకేతిక అభివృద్ధి యాజమాన్య సంస్థ (ఆత్మ) పై చర్చించారు. మండలాల్లో సభ్యులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా కమిటీలు ఏర్పాటు చేశారని మంచిర్యాల జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆత్మ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల ప్రగతిపై ఎందుకు సమాచారం ఉండడం లేదని మంత్రి జోగురామన్న పీడీ మనోహర్‌ను ప్రశ్నించారు. ఇకపై మండలస్థాయిలో చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని సభ్యులకు తెలియజేయాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
విద్యుత్‌పై గరం గరం..
విద్యుత్ శాఖపై సభ్యులు గరమయ్యారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదంటే ఎలా అని మంత్రి రామన్న ప్రశ్నించారు. దాని బాధ్యత ట్రాన్స్‌కో ఎస్‌ఈపై ఉందని కలెక్టర్ జగన్‌మోహన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలో సబ్ స్టేషన్ కోసం స్థలం ఉన్నా నిర్మాణంలో ఆలస్యమవుతోందని ఆ మండల జెడ్పీటీసీ వివరించారు. బెల్లంపల్లిలోని గుర్జాలలో విద్యుత్ లైన్లు వేసినా విద్యుత్ సరఫరా కావడం లేదని తెలిపారు. బె ల్లంపల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బోర్లు వేసేందుకు పరిపాలన అనుమతి లభించినా.. ఇప్పటివరకు వచ్చిన నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు.

జన్నారం మండలంలో బుడగజంగాలకు విద్యుత్ ఇవ్వడం లేదని, బేలలోని చప్రాలలో ఇప్పటివరకు సబ్‌స్టేషన్ పనులు ప్రారంభంకాలేదని ఆయా జెడ్పీటీసీలు తెలిపారు. వేమనపల్లి మండలంలో అక్రమ కనెక్షన్లు ఉన్నా వాటిని ఎందుకు తొలగించడం లేదని, అక్రమ కనెక్షన్లు ఉన్న వారితో డీడీలు కట్టించి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఎస్‌ఈకు సూచిం చారు. ఖానాపూర్ మండలంలోని చాలా గ్రామా లు విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చా రు. బెల్లంపల్లిలో ఇందిర జలప్రభ కింద బోర్లు వేసినా కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేం దుకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేస్తామని, ఇందుకు మంత్రి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇందిర జలప్రభ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయ భూముల్లో ఇప్పటివరకు మొత్తం 2,400 బోర్లు వేయగా, 700 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు డబ్బులు చెల్లించగా, కేవలం 621 బోర్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారని, మిగితా వాటికి ఇంకెంత సమయం పడుతుందని మంత్రి ప్రశ్నించారు. ఈయేడాదిలో పూర్తి చేస్తామని ఎస్‌ఈ వివరించారు. నార్నూర్‌లోని జక్కెపల్లిలో త్రీఫేజ్ కరెంటు సౌకర్యం లేదని, అక్కడ మొత్తం కర్ర స్తంభాలతో విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు.
 
గ్రామీణ నీటి సరఫరా..
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి జోగురామన్న ఆదేశించారు. ఇందుకు నియోజకవర్గా ల వారీగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, జెడ్పీటీసీలు, అధికారులు సమావేశాలు నిర్వహించాల ని పేర్కొన్నారు. చర్చలో భాగంగా మంచిర్యాల లోని నస్పూర్‌లో ట్యాంక్ నిర్మాణాలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ దక్కించుకుంటే వేరే వ్యక్తి ఆ పనులు చేస్తున్నాడని, ఇది అధికారులకు తె లియదా అని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. దిలావర్‌పూర్‌లో నాలుగు మంచినీటి ట్యాంకులు ఉన్నా నీరు లేదని, ఇంద్రవెల్లిలోని భీంనగర్, మిలిన్‌నగర్‌లలో ట్యాంకుల మరమ్మతు చేయించాలని ఆయా మండలాల జెడ్పీటీసీలు కోరారు.

చెన్నూర్ ప్రజలకు గోదావరి తాగునీరు అందించేందుకు పైపులైన్ పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, విద్యుత్ కనెక్షన్లు ఉన్నచోటా ట్యాంకులు పనిచేయడం లేదని, మంచినీటి ట్యాంకులు ఉన్నచోట విద్యుత్ కనెక్షన్లు లేవని, ఈ రెండు ఉన్న చోట పైపులైన్లు సరిగా లేక తాగునీరు రావడం లేదని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కుంటాలలో పైపులైన్ వేసేందుకు డబ్బులు చెల్లించారో లేదో వారికే స్పష్టత లేదని మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వైద్యారోగ్య, విద్య శాఖలపై ప్రశ్నల వర్షం
వైద్య, ఆరోగ్య, విద్యా శాఖల అధికారులపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. బజార్‌హత్నూర్ మండలంలో ఉన్న 35 పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరు కాగా, ఏ పాఠశాలలో కూడా ప్రారంభం కాలేదన్నారు. రామకృష్ణపూర్‌లోని క్యాతన్‌పల్లి పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డు కూడా లేదని పేర్కొన్నారు. కోటపల్లిలోని ఎసర్వాయి గ్రామంలో చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారని ఆయా మండలాల జెడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. బేలలో మోడల్ స్కూల్ నిర్మాణానికి స్థలం ఉందని, అది కొంత దూరంలో ఉందని తెలిపారు. మంజూరైన వెంటనే నిర్మాణ పనులు చేపడతామని డీఈవో సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. రెబ్బెన పాఠశాలలో హెచ్‌ఎం సహకరించడం లేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ మండల జెడ్పీటీసీ కోరారు. లక్ష్మణచాందలో వైద్యాధికారి లేడని అక్కడి జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకురాగా.. వైద్యాధికారి ఉన్నారని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ తెలిపారు.
 
సర్వశిక్షా అభియాన్, స్త్రీ, శిశు సంక్షేమంపై..

అనంతరం సర్వశిక్షా అభియాన్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిగింది. లక్ష్మణచాంద మండలంలో 14 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకువచ్చారు. కైలాస్‌నగర్‌లో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా వాటితో ప్రయోజనం లేకుండాపోయిందని జెడ్పీటీసీలు తెలిపారు. కొన్ని మండలాల్లో వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని  పలువురు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులను నియమించామని, విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జగన్‌మోహన్ వివరించారు.
 
ఆటాడుకుందాం రా..!
జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను చర్చిస్తుండగా.. మరోపక్క కొందరు అధికారులు సెల్‌ఫోన్‌లలో గేమ్స్ ఆడుతూ కనిపించారు.. ఇంకొందరు సమావేశ హాల్‌లో సెల్‌ఫోన్లను శుభ్రం చేస్తూ కనిపించారు. రాష్ట్ర మంత్రి, కలెక్టర్, జెడ్పీ సీఈవోలు పలుమార్లు అధికారులకు చెప్పినా వీరు మాత్రం ఇలా ఆటలపైనే దృష్టి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement