పలుగు పార పట్టిన పోలీసులు
చిన్నకోడూరు: తుపాకులు పట్టిన చేతులు పలుగు, పార పట్టాయి. టోపీలను మోసిన తలలు మట్టి తట్టలను మోశాయి. చట్టాలను రక్షించే పోలీసులు ప్రజల చుట్టాలైపోయారు. ఖాకీలు పల్లెల గోసకు కరుణతో కరిగిపోయారు. ఇలాంటి దృశ్యాలు మండల కేంద్రమైన చిన్నకోడూరు బెల్లం కుంట వద్ద మంగళవారం కనిపించాయి. మిషన్ కాకతీయలో భాగంగా బెల్లం కుంటను జిల్లా ఎస్పీ సుమతి దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా పూడిక తీత పనులు ఆమె ప్రారంభించారు. పోలీసుల స్పందనకు ప్రజలు బోనాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు.
అనంతరం ఎస్పీ సుమతి మాట్లాడుతూ తెలంగాణలో జీవనదులు లేవని పల్లెలకు జీవనాధారం చెరువులేనన్నారు. చెరువుల్లో పూడిక తీయడం ద్వారా నీటి సామర్థ్యం పెరిగి వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పెరుగుతుందన్నారు. ప్రజలకు నీటి సమస్య తీరుతుందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు. మిషన్ కాకతీయ పథకానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎక్కడైనా చెరువులు ఆక్రమణకు గురైతే పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు.
కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమలా రాంచంద్రం, మండల ప్రత్యేకాధికారి డా. అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ములకల కనకరాజు, పీఏసీఎస్ చైర్మన్‌లు మూర్తి బాల్‌రెడ్డి, కీసరి పాపయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సీఐలు ప్రసన్నకుమార్, సైదులు, వెంకటయ్య, అమృత రెడ్డి, వెంకటేశం తోపాటు ఎస్‌ఐలు, తహశీల్దార్ పరమేశం, ఎంపీడీఓ భిక్షపతి, కో ఆప్షన్ సభ్యుడు కలిమొద్దీన్, టీఆర్‌ఎస్ నాయకులు కుంట వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ శశికళ తదితరులు పాల్గొన్నారు.