పార్లమెంట్ గౌరవం కాపాడండి | Division of the High Court on the TRS question | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ గౌరవం కాపాడండి

Published Wed, May 6 2015 2:27 AM | Last Updated on Sat, Aug 18 2018 9:00 PM

పార్లమెంట్  గౌరవం కాపాడండి - Sakshi

పార్లమెంట్ గౌరవం కాపాడండి

హైకోర్టు విభజనపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్
ఈ అంశాన్ని త్వరగా  తేల్చాలంటూ లోక్‌సభలో ఆందోళన
29 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురే తెలంగాణ వారు
న్యాయవాదులు సమ్మె చేస్తున్నారు..
వారంలో విభజన అన్నారు.. ఏమైంది?
ఎప్పుడు నోటిఫై చేస్తారో చెప్పాలని డిమాండ్.. సభ మూడుసార్లు వాయిదా
కోర్టులో పిల్ ఉన్నందున తామేమీ చేయలేమన్న కేంద్ర న్యాయ మంత్రి
కేసు విచారణ పూర్తయిందన్న ఎంపీలు
15 రోజుల్లో సభ్యులతో సమావేశం
అవుతామన్న మంత్రి సదానందగౌడ

హైకోర్టు విభజనపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్
 
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చేపట్టాల్సిన హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని టీఆర్‌ఎస్ తీవ్రంగా మండిపడింది. ఆ చట్టం చేసిన పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశాన్ని వెంటనే తేల్చాలంటూ ఆ పార్టీ ఎంపీలు మంగళవారం లోక్‌సభలో ఆందోళన చేశారు. హైకోర్టులో ఉన్న 29 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురే తెలంగాణ వారని, విభజన కోసం న్యాయవాదులు సమ్మెకూడా చేస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం నిర్లక్ష్యం చూపడం దారుణమని విమర్శించారు.  దీంతో గందరగోళం చెలరేగి సభ మూడు సార్లు వాయిదాపడింది. హైకోర్టు విభజన అంశంపై టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతోపాటు పంజాబ్‌లో గ్యాంగ్ రేప్ ఘటనపై ఇతర పార్టీల సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఈ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నామని, వాటిని జీరో అవర్‌లో ప్రస్తావించవచ్చని స్పీకర్ ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, కె.కవిత, బాల్క సుమన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బి.బి.పాటిల్ తదితరులు పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇదే సమయంలో పంజాబ్ ఘటనపై వాయిదా తీర్మానమిచ్చిన సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో గందరగోళం చెలరేగింది. దీంతో ఉదయం 11.12కు పది నిమిషాల పాటు, 11.35కు 25 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైన తరువాత జీరో అవర్‌లో హైకోర్టు విభజన అంశంపై మాట్లాడేందుకు టీఆర్‌ఎస్ సభ్యులను స్పీకర్ అనుమతించారు. తొలుత జితేందర్‌రెడ్డి మాట్లాడారు.
 
ఎప్పుడు నోటిఫై చేస్తారో చెప్పాలి?

అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడారు. ‘‘న్యాయవ్యవస్థలో మాకు జరుగుతున్న అన్యాయంపై దశాబ్దాలుగా పోరాడుతున్నాం. ప్రభుత్వం హైకోర్టు విభజనను ఎప్పుడు నోటిఫై చేస్తుందో చెప్పాలి. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం నోటిఫై చేయాలి. కానీ కేంద్రం సమర్పించిన అఫిడవిట్ చట్టంలో పేర్కొన్నట్టుగా లేదు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కేంద్రం పరిరక్షించాలి..’’ అని పేర్కొన్నారు.
 
హైకోర్టులో ఉంది..

టీఆర్‌ఎస్ ఎంపీల ప్రశ్నలపై కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ సమాధానం ఇచ్చారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించిందన్నారు. ‘‘రెండు రాష్ట్రాల సీఎంలతోనూ, తెలంగాణ ఎంపీలతోనూ ఈ అంశంపై నేను సమగ్రంగా చర్చించాను. దీనిపై ఒక దశలో ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు రాష్ట్రాల హైకోర్టులకు మౌలిక వసతులు సూచిస్తామన్నారు. ఆ ప్రకారం సమస్యను పరిష్కరిద్దామనుకున్నాం. తెలంగాణ సీఎం ఒక లేఖ కూడా రాశారు. ఇదే సమయంలో హైకోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం దాఖలవడంతో మా చేతులు కట్టేసినట్లయింది. హైకోర్టు తీర్పు వెలువరిస్తే దాని ప్రకారం నడుచుకుంటాం. సాధ్యమైనంత త్వరగా తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం..’’ అని సదానందగౌడ పేర్కొన్నారు. ఈ సమయంలో ఎంపీ వినోద్ జోక్యం చేసుకుని కేసు విచారణ పూర్తయి, తీర్పు కూడా వెలువడిందని స్పష్టం చేశారు. దీంతో సదానందగౌడ మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం నాకు తెలియదు. ఒకవేళ ఆ కేసు పరిష్కారమై ఉంటే.. పరిశీలించి నిర్ణయం తీసుకుందాం..’’ అన్నారు. అయితే ఎప్పటిలోగా పరిష్కరిస్తారో గడువు తెలపాలని ఎంపీ వినోద్ కోరారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ‘‘నేనెలా గడువు చెబుతాను. మౌలిక వసతులు, ఇతరత్రా పరిశీలించాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విస్తృతంగా సంప్రదింపులు జరపాలి. 2 రాష్ట్రాల సీఎంలతో చర్చించాలి. ఇవన్నీ జరిగాకగానీ ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పలేను..’’ అని స్పష్టం చేశారు.

ఈ సమాధానంపై టీఆర్‌ఎస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయగా.. ‘‘15 రోజుల్లో ఎంపీలతో సమావేశమై చర్చిస్తాం. ఒక పరిష్కారం వెతుకుతాను’’ అని సదానందగౌడ పేర్కొన్నారు. దీంతో జితేందర్‌రెడ్డి లేచి ‘‘హైకోర్టులో దాఖ లైన పిల్ విచారణ పూర్తయింది. ఇంకా చర్చలు ఎందుకు? ప్రత్యేక హైకోర్టు ఉంటుందని పార్లమెంట్ చేసిన చట్టంలోనే ఉంది. పార్లమెంట్ గౌరవం కాపాడండి. మళ్లీ చర్చల కోసం 15 రోజులు ఎందుకు ఆగాలి’’ అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తిన ఈ అంశాలకు వివిధ పార్టీల ఎంపీలు ఎం.బి.రాజేశ్, పి.కె.బిజు, పి.కె.శ్రీమతి టీచర్, డాక్టర్ ఎ.సంపత్, పి.కరుణాకరన్ సంఘీభావం తెలిపారు.
 
పార్లమెంట్ ఆవరణలో ధర్నా

 
రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. హైకోర్టును విభజించాలని నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిసారి పార్లమెంటులో కోరుతూనే ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరాలు లేవని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement