ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదు
Published Mon, Feb 27 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
సాక్షి, గద్వాల : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని జిల్లాపరిషత్ చైర్మన్ భాస్కర్ అన్నారు. ఆదివారం గద్వాలలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరినందుకు తిరుపతిలో కానుకలు సమర్పిస్తే హర్షించాల్సింది పోయి స్థాయి దిగజారి మాట్లాడటం కాంగ్రెస్ నాయకులకే చెల్లిందన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ మాట్లాడుతున్న వారు చేతనైతే ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.
డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే జూపల్లి కృష్ణారావు అని పాన్‌గల్‌లో జెడ్పీటీసీగా గెలిపించింది మరిచిపోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నెట్టెంపాడును పూర్తి చేసేందుకు కృష్ణమోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర కాంట్రాక్టర్ల మోచేతి నీళ్లు తాగింది.. ఆంధ్ర ప్రాజెక్టు ప్రారంభానికి హారతి పట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. జలయజ్ఞంను ధన యజ్ఞంగా మార్చి నడిగడ్డ ప్రాజెక్టు గుత్తేదారులను బెదిరించింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. స్త్రీని గౌరవించాలనే సంప్రదాయం టీఆర్‌ఎస్ నాయకులకు ఉంది కాబట్టి విమర్శించడం లేదన్నారు. అనవసరమైన విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎంపీపీ సుభాన్, నాయకులు బీఎస్ కేశవ్,మహమూద్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement