‘గులాబీ’ గూడుపై కసరత్తు | TRS Leaders Planes To Construct Party Office Jangaon | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 5 2019 3:54 PM | Last Updated on Sat, Jan 5 2019 3:54 PM

TRS Leaders Planes To Construct Party Office Jangaon - Sakshi

సాక్షి, జనగామ : గులాబీ గూడుపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. పార్టీ సైనికుల బాగోగుల గురించి ప్రారంభించబోతున్న కార్యాలయం నిర్మాణం కోసం విస్తృతంగా అన్వేషణ జరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే కేడర్‌కు అనువుగా ఉండే విధంగా   కార్యాలయం నిర్మాణం ఉండాలనే ధ్యేయంగా ఆలోచనలు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల కార్యకర్తలకు కేంద్రంగా ఉండే స్థల సేకరణ కోసం ప్లాన్‌ చేస్తున్నారు. ఆరు నెలల్లోనే కార్యాలయం అందుబాటులోకి రావాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ పార్టీ నేతలను ఆదేశించారు. త్వరగా స్థల సేకరణ చేసి  కార్యాలయ నిర్మాణం చేపట్టాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సూచించారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ ఎన్నికైన తర్వాత తొలిసారిగా గత సంవత్సరం డిసెంబర్‌ 20న జిల్లాకు వచ్చారు. కార్యకర్తల ఆశీర్వదసభలో పాల్గొన్న కేటీఆర్‌ ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నామని ఇక్కడే ప్రకటించారు. జిల్లాలోనే తొలిసారిగా ప్రకటించడంతో త్వరగా కార్యాలయం నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నేతలు స్థల సేకరణపై దృష్టి పెట్టారు.

పరిశీలనలో నాలుగు ప్రాంతాలు..
జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం నాలుగు ప్రాంతాలను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి బాలమల్లుతో కలిసి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. హైదరాబాద్‌ రోడ్డులోని ప్రస్తుత వన నర్సరీ సమీపంలోని కుమ్మరికుంట, చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్‌ ఆస్పత్రి పక్కన, హన్మకొండ రోడ్డులోని దయ నిలయం సమీపంలోని ప్రభుత్వ స్థలం, సూర్యాపేట రోడ్డులోని ప్రస్తుత కలెక్టరేట్‌ నిర్మాణం జరుగుతున్న వెనుక ప్రాంతాన్ని పరిశీలించారు.

దయ నిలయం వైపే మొగ్గు..
పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 4750 గజాల స్థలం(ఎకరం) కావాల్సి ఉంది. పార్కింగ్‌ స్థలంతోపాటు, రవాణా సౌకర్యం, పార్టీ కార్యక్రమాలకు అనువైన స్థలం ఉండే విధంగా చూస్తున్నారు. అయితే చంపక్‌హిల్స్‌లో పార్టీ కార్యాలయం నిర్మిస్తే కేవలం జనగామ నియోజకవర్గానికి మాత్రమే అనువుగా ఉంటుందని, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలకు దూరంగాఉంటుందనే వాదనను పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కుమ్మరికుంట, దయనిలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలం అయితే బెటర్‌గా ఉంటుందని పార్టీ నాయకులకు వివరించారు. సూర్యాపేటరోడ్డులో అయితే అందరికీ అనుకూలంగా ఉన్నప్పటికీ కలెక్టరేట్‌ కోసం సేకరించిన స్థలం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. స్థలంతోపాటు, పార్కింగ్, రవాణా సౌకర్యం పరంగా దయ నిలయం వెనుక ఉన్న స్థలంలోనే కార్యాలయం నిర్మిస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదనే పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. పక్కనే పోలీసు క్వార్టర్స్‌ ఉండడంతో సెక్యూరిటీ ప్రకారంగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పెద్ద నాయకులు వస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వన్‌వే ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా దయ నిలయం పక్కనే ఉన్న స్థలాన్ని అంబేడ్కర్‌ భవన నిర్మాణం కోసం కేటాయించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సైతం అందిస్తున్నారు.

పండుగ తర్వాత ఫైనల్‌..
జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం స్థలం ఖరారు సంక్రాంతి పండుగ తర్వాత ఫైనల్‌ చేసే అవకాశం ఉంది. స్థల సేకరణ పూర్తయితే వెంటనే నిర్మాణం చేపట్టే ఆలోచన చేస్తున్నారు. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ నా టికి కార్యాలయం అందుబాటులోకి తీసుకువచ్చే అవకా శం ఉందని పార్టీ నాయకుడొకరు వివరించారు. పార్టీ కా ర్యాలయం ఎక్కడ నిర్మిస్తారనే అంశం సొంత పార్టీ శ్రేణుల్లో కాకుండా రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement