కారులో కోల్డ్‌వార్‌ | TRS Leaders Conflicts in Jangaon Suspensions | Sakshi
Sakshi News home page

కారులో కోల్డ్‌వార్‌

Published Tue, Jul 28 2020 12:13 PM | Last Updated on Tue, Jul 28 2020 12:13 PM

TRS Leaders Conflicts in Jangaon Suspensions - Sakshi

సాక్షి, జనగామ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు నాయకులను బహిష్కరించడం కలకలం రేపుతోంది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారే కారణంతో సొంత పార్టీ నాయకులపై వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మండల అధ్యక్షుడు, మండల ఇన్‌చార్జిలను బహిష్కరించడంతో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. 

ఇద్దరిపై బహిష్కరణ వేటు..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా ఎమ్మెల్యే రాజయ్యపై అనుచిత వ్యాఖ్యాలు చేస్తున్నారనే కారణంతో ఇద్దరు నాయకులపై ఆదివారం బహిష్కరణ వేటు వేశారు. ఏడాది క్రితం చిల్పూర్‌ మండల అధ్యక్షుడిగా కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సాంస్కృతిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు ఎడవెల్లి విజయను మండల ఇన్‌చార్జిగా నియమించారు. కొంతకాలం నుంచి ఎమ్మెల్యే రాజయ్యకు మండల అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఎమ్మెల్యే ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోకపోవడమే కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దగ్గర అవుతున్నారు. దీంతో మనోజ్‌రెడ్డిని మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీంతో మనోజ్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి సోషల్‌ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఇటీవల వైరల్‌గా మారాయి. దీంతో ఆదివారం సాయంత్రం చిల్పూర్‌ మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే రాజయ్య అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో చర్చించి కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి, ఎడవెల్లి విజయను పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

మరోసారి తెరపైకి ఆధిపత్య పోరు..
ఇద్దరు నాయకులను పార్టీ నుంచి బహిష్కరించడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో మరోసారి ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. ఎ మ్మెల్సీ కడియం శ్రీహరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగానే నాయకులపై వేటు వేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వేర్వేరు పార్టీల్లోనూ, ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ మొత్తం కడియం, రాజయ్య వర్గాలుగా విడిపోయింది. 2018లో జరిగిన ఎన్నికల సమయంలో కేటీఆర్‌ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో కలిసి పనిచేశారు. ఆ తరువాత మళ్లీ ఆధిపత్య పోరు యాధావిధిగానే కొనసాగుతూ వస్తుంది.

పార్టీ సంస్థాగత కమి టీల్లోనూ ఎక్కడా కడియం వర్గీయులకు చోటు కల్పించకుండా రాజయ్య జాగ్రత్తగా వ్యవహరించారు. గ్రామ పంచా యతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ కడియం అనుచరులకు ఎక్కడా టికెట్లు ఇవ్వలేదు. 2019 సెప్టెంబర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి వేర్వేరుగా కాళేశ్వరం సందర్శన యాత్రను చేపట్టడం రెండు వర్గాల మధ్య మరింతగా చిచ్చుపెట్టింది. దేవాదుల నీటితో నియోజకవర్గంలోని చెరువులను నింపడానికి ఇద్దరు నేతలు పోటీపడడంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ ఆవిర్బావ వేడుకల్లో కడియంపై రాజయ్య పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. పైకి మాత్రం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని పేర్కొంటున్నప్పటికీ పరోక్షంగా మాత్రం కడియం వర్గీయులుగా మారడంతోనే వేటువేశారని చర్చించుకుంటున్నారు. ఈ చర్యతో మరోసారి పార్టీలో ఆధిపత్యపోరు బహిర్గతం అయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement