
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ సివిల్, ఇతర విభాగాల ప్రిలిమినరీ రాతపరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. ఈ నెల 26న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను 16వ తేదీ ఉదయం 8గంటల నుంచి 24వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై గతంలో దరఖాస్తు చేసిన సమయంలో అప్‌లోడ్‌చేసిన ఫొటోనే తప్పనిసరిగా అతికించి తీసుకురావాలని సూచించారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్–తెలుగు/ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో ఉంటుందని తెలిపారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్‌ఫోన్లు, కాలిక్యులేటర్, రిస్ట్ వాచెస్, బ్లూటూత్ తదితరాలను అనుమతించబోమని తేల్చిచెప్పారు. బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే పరీక్ష రాయాలని పేర్కొన్నారు. ప్రతీ అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకుంటామని, అభ్యర్థులెవరు మెహందీ, తాత్కాలిక టాటూలను వేళ్లపై వేసుకోవద్దని సూచించారు. ఓఎంఆర్ సమాధానపత్రంపై ఎలాంటి అభ్యంతరకరమైన సందేశాలు, గుర్తులు రాయవద్దని స్పష్టం చేశారు.